అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…..ఎమ్మెల్యే తలసాని..

బేగంపేట మే 17(జే ఎస్ డి ఎం న్యూస్)
అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. శనివారం బన్సీలాల్ పేట డివిజన్ లోని జి వై ఆర్ కాంపౌండ్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఇటీవల బస్తీ అధ్యక్షుడు వెంకట్ బాబు, ఇతర బస్తీ వాసులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి పలు సమస్యలను విన్నవించారు. దీంతో స్పందించిన ఆయన త్వరలో బస్తీలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఈరోజు అధికారులతో కలిసి పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా బస్తీ ప్రజలు ఫంక్షన్ లు, మీటింగ్ లు జరుపుకోవడానికి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అక్కడే ఉన్న డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ డాకు నాయక్ ను ఆదేశించారు. అదేవిధంగా తమకు త్రాగునీరు తక్కువగా వస్తుందని, కలుషితం అవుతున్నాయని పలువురు మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రాగా సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ జి .ఎం.వినోద్ ను ఆదేశించారు. లిఫ్ట్ పని చేయడం లేదని, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిర్యాదు చేయగా, లిఫ్ట్ మరమ్మతులు వెంటనే చేపట్టి బస్తీ ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణ కూడా సక్రమంగా లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు కేటాయించాలని పలువురు కోరగా, స్థానికులైన అర్హులకే ఇండ్లను కేటాయించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. తమకు పెన్షన్ లు రావడం లేదని పలువురు ఎమ్మెల్యే కు విన్నవించగా, అర్హులైన వారి వివరాలను సేకరించి అందజేస్తే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మంజూరు చేయిస్తానని ప్రకటించారు. సి సి కెమెరాలు పని చేయడం లేదని తెలపగా, వెంటనే మరమ్మతులు చేయిస్తామని, అవసమైతే నూతన కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన సౌకర్యాలు, వసతులు లేకుండా అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. మీరు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో నే ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వడం జరిగిందని చెప్పారు. మిగిలిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన స్థానికులకే ఇస్తామని స్పష్టం చేశారు. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం కోసం నేను ఉన్నానని భరోసా ఇచ్చారు. బస్తీ వాసులు అంతా ఒక కుటుంబం మాదిరిగా కలిసి ఉండాలని కోరారు. బస్తీ పిల్లలు క్రికెట్ కిట్ కావాలని కోరగా, గంటలోపే అందజేశారు. ముందుగా బస్తీ వాసులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, డి సి డాకు నాయక్, ఈ ఈ సుబ్రహ్మణ్యం, డీ ఈ ఆంజనేయులు, వాటర్ వర్క్స్ జి .ఎం. వినోద్, శానిటేషన్ డి ఈ వెంకటేష్, ఎలెక్ట్రికల్ ఏ ఈ కృష్ణ, హార్టికల్చర్ అధికారి విశాల్, స్ట్రీట్ లైట్ ఏ ఈ సాగర్ బస్తీ అధ్యక్షుడు వెంకట్ బాబు, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *