హైదరాబాద్ జులై 20(జే ఎస్ డి ఎం న్యూస్):
సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యత, విశ్వసనీయత పెరిగినప్పుడే శాంతిపూర్వకమైన అభివృద్ధి సాధ్యమవుతుందని వక్తలు పిలుపునిచ్చారు. సామాజిక ఐక్యతను పెంచడానికి బ్రహ్మా కుమారీలు కుల మతాలకు అతీతంగా చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆదివారం బీబీనగర్ సమీపంలోని బ్రహ్మా కుమారీస్ సైలెన్స్ రిట్రీట్ సెంటర్లో పబ్లిక్ రిలేషన్స్ మీద రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది.
ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాలు, జంట నగరాల నుంచి పీఆర్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్లోబల్ పబ్లిక్ రిలేషన్స్ ఫోరం, బ్రహ్మా కుమారిస్ సంయుక్త ఆధ్వర్యంలో “ శాంతి, ఐక్యత, విశ్వసనీయత కోసం పబ్లిక్ రిలేషన్స్” అంశం మీద సెమినార్ నిర్వహించారు.
పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అజిత్ పాఠక్ ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తూ ప్రపంచ దేశాల మధ్య, సమాజంలోని వర్గాల మధ్య, కుటుంబంలోని వ్యక్తుల మధ్య విశ్వసనీయత లోపించినప్పుడు అశాంతి ఏర్పడుతుందని, ఇలాంటి తరుణంలో ఆధ్యాత్మికత ద్వారా పాజిటివిటీని పెంచితే శాంతి, సామరస్యత నెలకొంటాయని అన్నారు.పబ్లిక్ రిలేషన్స్ ప్రతినిధుల్లో నైతికత, విశ్వసనీయత ఉన్నప్పుడు వృత్తి లోరాణించగలుగుతారని పాఠక్ చెప్పారు.
పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రపంచం మొత్తం వసుదైవ కుటుంబం అనే భావనతోనే పని చేస్తోందని, బ్రహ్మాకుమారీలు కూడా ఇదే లక్ష్యంతో కృషి చేస్తుండటం అభినందనీయమని అన్నారు.
సదస్సుకు నేతృత్వం వహించిన బ్రహ్మా కుమారిస్ మీడియా వింగ్ వైస్ చైర్ పర్సన్ బి. కె.సరళ మాట్లాడుతూ పీఆర్ ప్రతినిధులు వృత్తిలో ఆధ్యాత్మిక, నైతిక విలువలను జోడించినట్లయితే సమాజంలో ఐక్యత, సామరస్యత ప్రశాంతత వృద్ధి చెందుతాయని చెప్పారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లోని అన్ని విభాగాల మధ్య ప్రేమపూర్వక సంబంధాలను నెలకొల్పటంలో పబ్లిక్ రిలేషన్స్ ప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తారని,వీరు వ్యక్తిగత స్థాయిలో శాంతిని కలిగి ఉన్నప్పుడే సంస్థలో కూడా శాంతిపూర్వకమైన అభివృద్ధినిచూడగలుగుతారని చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా రాజయోగ శిక్షణ ద్వారా బ్రహ్మాకుమారీస్ ప్రత్యక్షంగా శాంతిని నెలకొల్పే సేవలు అందిస్తున్నారని, అందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ సంపాదకుడు వై.బాబ్జి మాట్లాడుతూ టెక్నాలజీ, కృత్రిమ మేథ కారణంగా మానవ సంబంధాలు తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో సమాజంలోని వ్యక్తుల్లో, వ్యవస్థల్లో శాంతిని పెంపొందించే బాధ్యత పీఆర్ ప్రతినిధుల పై ఉందన్నారు. బ్రహ్మాకుమారీలు నేర్పే రాజయోగ ధ్యానం వృత్తిలో ఎదురయ్యే అన్ని రకాల సవాళ్లను పరిష్కరించే సమర్థతను పెంచుతుందని, ఆధ్యాత్మిక రంగంలో బ్రహ్మా కుమారీల సేవలు సాటిలేనివని చెప్పారు.ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ యుద్ధాలు జరుగుతున్న దేశాల్లో కూడా బ్రహ్మా కుమారీస్ శాంతిని పెంచే సేవలు అందిస్తున్నారని కొనియాడారు. నిరంతరం ఒత్తిడితో నిండిన మీడియా, పీఆర్ రంగంలోని వ్యక్తులకు బ్రహ్మాకుమారీల శిక్షణ అద్భుతంగా సహాయపడుతుందని చెప్పారు.సమాజంలో సవాళ్లు, సంక్లిష్టతలు పెరుగుతున్న తరుణంలో శాంతి సామరస్యతలను కాపాడే కీలకమైన బాధ్యత పీఆర్ రంగంపై ఉందని బ్రహ్మా కుమారిస్ మీడియా వింగ్ చైర్మన్ రాజయోగి బి. కె. కరుణా భాయ్ మౌంట్ అబూ నుంచి ఆన్ లైన్ ద్వారా మాట్లాడారు.సైలెన్స్ రిట్రీట్ సెంటర్ డైరెక్టర్లు బి.కె. రాజకుమారీ ప్రాక్టికల్ ధ్యానం అనుభూతి చేయించగా, బి.కె. సునీత పీ.ఆర్.ఓలు పాజిటివిటీ లేదా పరమాత్మ రిలేషన్ ఆఫీసర్స్ గా భావించుకుంటే శాంతిని పెంపొందించగలరని సూచించారు. పీఆర్ రంగంలో అత్యుత్తమ సేవలకుగాను బ్రహ్మా కుమారీస్ అందించే గోల్డెన్ ట్రయాంగిల్ పురస్కారాలను అజిత్ పాఠక్, బాబ్జి అందుకున్నారు.ఈ కార్యక్రమంలో హిందీ మిలాప్ చీఫ్ ఎడిటర్ ప్రకాష్ జైన్, పీఆర్ఎస్ఐ హైదరాబాద్ అధ్యక్షుడు డాక్టర్ గిరి, తెలంగాణ అఫ్ సెట్ ప్రింటర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, అనింది త ముఖర్జీ, బి. కె. నిర్మల తదితరులు పాల్గొన్నారు.



