రోడ్డు ప్రమాదాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి చెప్పారు. ప్రమాదాలకు గురైన వారికి సత్వర వైద్య సహాయం అందడంలో ప్రజలు కూడా తమ వంతు బాధ్యత వహించేలా వారికి విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. మంగళవారం ప్రకాశం భవనంలో ఆమె అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. ప్రాణాపాయ ప్రమాదాలు గత ఏడాదితో పోల్చితే 25 శాతం తగ్గాయని పోలీస్ అధికారులు ఈ సమావేశంలో వివరించారు. దీనిపై ఆమె స్పందిస్తూ ప్రతి ప్రాణం విలువైనదని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఒక్కరు కూడా చనిపోకూడదని చెప్పారు. మరమ్మతులు, రహదారులపై అవసరమైన చోట బారికేడ్లు, సిమెంట్ బ్లాక్స్, బ్లింకింగ్ లైట్స్, సైన్ బోర్డ్స్ వంటివి ఏర్పాటు చేయటంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె దిశా నిర్దేశం చేశారు. ప్రమాదాలు జరగకుండా అధికార యంత్రాంగపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రమాదాలకు గురైన వారికి వైద్య సహాయం అందటంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఈ విషయంలో ప్రజల కూడా సహకరించాలని ఆమె కోరారు. ప్రమాద సమాచారాన్ని వెంటనే పోలీసులకు, వైద్యులకు తెలియజేయాలని చెప్పారు. ఈ విధమైన సహాయం చేయడం ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడినవారవుతామని అన్నారు. ఇలాంటి గుడ్ సమారిటన్లను ప్రభుత్వం అభినందిస్తుందని, ‘ పోలీస్ విచారణ’ల పేరుతో భయపడాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడడంలో, సత్వర వైద్య సహాయం అందడంలో ‘ గుడ్ సమారిటన్లు ‘ గా నిలిచిన మద్దిపాడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన రవి ప్రసాద్, మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం బొడ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన డి.వెంకట రమణారెడ్డిలను ఈ సమావేశంలో ఘనంగా సత్కరించి ఆర్థిక సహాయం అందించారు. రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ వంటి పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ చెప్పారు.
ఈ సమావేశంలో డిటిసి ఆర్.సుశీల, ఒంగోలు ఆర్డిఓ చంద్రశేఖర్ నాయుడు, డి.ఎస్.పి. ఆర్. శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఎస్.ఈ. రవినాయక్, డీఈవో రేణుక, డీఎస్ఓ పద్మశ్రీ, డీ.ఎం.హెచ్.ఓ. వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్, జి.జి.హెచ్.సూపరింటెండెంట్ మాణిక్యరావు, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రతినిధులు, అన్ని మున్సిపాలిటీల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

