తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో పిజిఆర్ఎస్ కు వచ్చే అర్జీదారుల సమస్యలపై, సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేసి, అర్జీదారులు సంతృప్తిచెందేలా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని మీకోసం సమావేశ హాలు నందు.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తోపాటు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఎస్డిసీలు వర కుమార్, శ్రీధర్ రెడ్డి, జాన్సన్, పార్ధసారధి, కుమార్ లు హాజరై ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ… ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలకు పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి అర్జీదారులుబ సంతృప్తిచెందేలా ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు.
ఈ సందర్భంగా వివాహానికి ముందు ఎదుర్కొనే సవాళ్లు మరియు ఇతర సంబంధిత విషయాలపై మార్గదర్శకత్వం పొందేలా ఏర్పాటుచేసిన ప్రీ-మెరిటల్ కౌన్సెలింగ్ కేంద్రాల సేవలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియ, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఐసిడిఎస్ పిడి సువర్ణ, తదితర అధికారులతో కలసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


