ఇటీవల కడప నగరానికి చెందిన యువతి వివాహం హైదరాబాద్‌లో జరిగింది.. పెళ్లి వారంతా నాలుగు బస్సుల్లో ప్రయాణమయ్యారు. ఇంకా రెండు బస్సులకు అయ్యే జనం ఉన్నా దూరాభారమని వయసు మీదపడిన వారు వెనక్కుతగ్గారు. అదే రైలు బోగీలు బుక్ చేసుకుని ఉంటే బంధువులంతా పెళ్లికి వెళ్లేవారు. సమాచారం తెలియక వెనకడుగు వేశారు. అలాంటి వారికి ఉపయుక్తమే ఈ సమాచారం.
జె.ఎస్. డి. ఎం న్యూస్ :
పెళ్లిళ్లు, శుభకార్యాల సమయాల్లో బస్సులు అద్దెకు తీసుకుని వెళ్లడం మీరు చూసే ఉంటారు.. ఎక్కువ సంఖ్యలో బంధు, మిత్రులు ఉన్న సమయంలో సురక్షిత ప్రయాణానికి బస్సులే కాకుండా రైలును కూడా బుక్ చేసుకోవచ్చని మీకు తెలుసా! ఇది తీర్థ యాత్రలకు కూడా వర్తిస్తుందండోయ్. మన బడ్జెట్లోనూ ఈ సదుపాయం పొందే అవకాశాలు రైల్వేలు మనకు కల్పిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం.
బోగీకి రూ.50 వేలు డిపాజిట్టు
ఎఫ్టీఆర్ ఐఆర్సీటీసీ ద్వారా ఒకటి నుంచి రెండు బోగీలను గరిష్ఠంగా బుక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మొత్తం రైలులోని అన్నీ కోచ్‌లను బుక్ చేసుకోవాలంటే మాత్రం సాధ్యసాధ్యాలను బట్టి కనిష్టంగా 18, గరిష్టంగా 24 కోచ్‌లను బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఒక్కో కోచ్‌కు రూ.50 వేలు డిపాజిట్ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. మనకు రెండు బోగీలే చాలనుకుంటే మాత్రం రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగాకుండా పది, పన్నెండు బోగీలు అవసరం అయినప్పటికీ… 18 బోగీల సెక్యూరిటీ డిపాజిట్ మొత్తం (రూ.9 లక్షలు) చెల్లించాలి. ఇందులో మనం ఎంచుకున్న బోగీలను బట్టి, మనం ప్రయాణించే దూరాన్ని బట్టి రైల్వే అధికారులు ధరను నిర్ణయిస్తారు. రైలును బుక్‌ను చేసుకున్నప్పడు 18 బోగీల్లోని ప్రయాణికుల మొత్తం ఎంత అవుతుందో ఆ మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని పది పనివేళల్లో చెల్లిస్తారు. అలా కాకుండా ఒకటి, రెండు బోగీలలో మాత్రమే ప్రయాణించి ఉంటే ఆ మొత్తం పట్టుకుని సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి చెల్లిస్తారు.
రైలు ఎలా బుక్ చేసుకోవాలంటే..
గూగుల్ ఓపెన్ చేసి ఎఫ్టీఆర్ ఐఆర్సీటీసీ అని టైప్ చేయగానే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మన సమాచారాన్ని నమోదు చేసి రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. మనకు బోగీ కావాలంటే కోచ్ అని… రైలు కావాలంటే రైలు అని ఎంపిక చేసుకోవాలి. రైలులోని అన్ని కోచ్‌లు కావాలంటే కనిష్ఠంగా 18, గరిష్ఠంగా 24 కోచ్‌లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టైప్ ఆఫ్ కోచ్ (స్లీపర్/ త్రిటైర్ ఏసీ/ టూటైర్ ఏసీ/ మొదటి తరగతి ఏసీ)లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆపై ఏ స్టేషన్లో ఎక్కుతారు, ఏ స్టేషన్లో దిగుతారన్న వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. కనీసం 30 రోజుల ముందుగానే మనం రైలు లేదా కోచ్‌లను కానీ రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన వారం లోపు కన్ఫర్మేషన్ వస్తుంది. అలా కన్ఫర్మేషన్ వస్తేనే బుకింగ్ కన్ఫార్మ్ అయినట్లు భావించాలి.
వీరికి ఎంతో ఉపయోగకం
హైదరాబాదులో జరిగే పెళ్లికి కడప నుంచి 70 మంది వెళ్లాలనుకుంటే ఒక బస్సు సరిపోదు. అదే రైలులో ఒక బోగీని బుక్ చేసుకుని వెళ్లవచ్చు. ఎక్కువ మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు విహార యాత్రలకు వెళ్లేటప్పుడు కూడా ఈ విధానాన్ని అమలు పరచవచ్చు. అలాగే భారీ బహిరంగ సభలకు కూడా రైలులోని అన్ని కోచ్‌లను ఎంపిక చేసుకోవచ్చు. మొత్తం మీద ఐర్సీటీసీ ద్వారా టిక్కెట్లను రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
సాధారణంగా స్లీపర్ కోచ్, త్రిటైర్ ఏసీకు ఒక్కో కోచ్‌కు 72 సీట్లు ఉంటాయి. అలాగే 2 టైర్ ఏసీకి 44 సీట్లు, 1 టైర్ ఏసీకి 24 సీట్లుంటాయి. ఫుల్ తారీఫ్ కోచ్ / ఫుల్ తారీఫ్ ట్రైన్ ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. సాధారణంగా ఆన్లైన్ ద్వారానే ఈ ప్రక్రియ జరుగుతుంది. అత్యవసరం అయితే రైల్వేబోర్డు నుంచి అనుమతి తెచ్చుకుని ఆఫ్‌లైన్ ద్వారా కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు.