పతంగ్ ఉడావ్.. గర్దన్ మత్ కాటో..చైనీస్ మాంజాపై సజ్జనర్ ‘దక్కనీ’ దమ్కీ! -హైదరాబాదీ స్టైల్‌లో నగర సీపీ ట్వీట్ల పర్వం-తెలంగాణ యాసలోనూ హెచ్చరికలు- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చమత్కారపు పోస్టులు

హైదరాబాద్ , జె. ఎస్. డి. ఎం ప్రతినిధి :
‘‘మియా.. పతంగ్ ఉడావ్.. గర్దన్ మత్ కాటో.. (మిత్రమా.. పతంగి ఎగరేసుకో.. కానీ పక్కోడి గొంతు కోయకు).. ఇది ఏదో సినిమా డైలాగ్ కాదు.. సంక్రాంతి వేళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ‘దక్కనీ’ దమ్కీ! పండుగ పూట ఆకాశంలో పతంగి ఎగరాలి కానీ.. రోడ్డు మీద వెళ్లేవాడి ప్రాణం గాలిలో కలవకూడదని ఆయన సరికొత్త పంథాలో ప్రజలను చైతన్యపరుస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఖాకీ చొక్కా కాఠిన్యాన్ని పక్కనపెట్టి.. పక్కా హైదరాబాదీ ‘భాయ్’ అవతారమెత్తారు. ‘చైనా కా సామాన్.. చలే తో చాంద్ తక్..’ అంటూ సామెతలు చెబుతూనే.. చైనీస్ మాంజా వాడితే ‘సీదా అందర్ (జైలుకే)’ అంటూ తనదైన శైలిలో హెచ్చరిస్తున్నారు.

SayNoToChineseManja అనే హ్యాష్‌ట్యాగ్‌తో నగర సీపీ వీసీ సజ్జనార్ ఇటీవల చేసిన పలు ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో ‘ఖతర్నాక్’ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి.

సాధారణంగా పోలీసుల హెచ్చరికలంటే విజ్ఞప్తులు, చట్టపరమైన సెక్షన్ల ప్రస్తావనలే ఉంటాయి. కానీ, సజ్జనార్ మాత్రం ఆ గంభీరత్వాన్ని పక్కనబెట్టి.. హైదరాబాద్ ఆత్మ అయిన స్థానిక ‘దక్కనీ ఉర్దూ’, తెలంగాణ యాసనే అస్త్రంగా మలుచుకున్నారు. “చైనా కా సామాన్.. చలే తో చాంద్ తక్, వర్నా షామ్ తక్ (చైనా సరుకు ఉంటే చందమామ దాకా.. లేదంటే సాయంత్రం దాకా)” అనే నానుడిని ప్రస్తావిస్తూనే.. చైనీస్ మాంజా మాత్రం పక్కా డేంజర్ అని చమత్కరించారు. “అపన్ హైదరాబాద్ మే ఐసా నై కర్తే మియా (మన హైదరాబాద్‌లో మనం ఇలాంటి పనులు చేయం మిత్రమా).. చైనీస్ మంజా = ఫుల్ డేంజర్” అంటూ లోకల్ టచ్‌తో యువతకు క్లాస్ పీకారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంక్రాంతి వేళ యువతను ఆలోచింపజేస్తున్నాయి.

గాలిపటాలు ఎగరేయడాన్ని తాము తప్పుపట్టడం లేదని చెబుతూనే.. “పతంగ్ ఉడావ్, ఖుషీ మనావ్.. లేకిన్ చైనీస్ మాంజా యూజ్ మత్ కరో” అని సూచించారు. బైక్ మీద వెళ్లేవారి మెడకు మంజా చుట్టుకుంటే పరిస్థితి ఏంటో ఆలోచించాలన్నారు.

ఇది కేవలం పతంగి వ్యవహారం కాదు మియా.. ఇది చావు బతుకుల సీన్ (జిందగీ ఔర్ మౌత్ కా సీన్ హై) అంటూ #SayNoToChineseManja హ్యాష్‌ట్యాగ్‌ను జోడిస్తూ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆయన చేసిన హెచ్చరికలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.

కేవలం దక్కనీ ఉర్దూలోనే కాదు, అచ్చమైన తెలంగాణ యాసలోనూ సజ్జనార్ ట్వీట్ల వర్షం కురిపించారు. “చైనీస్ మాంజా సావ డేంజర్.. పానాలతోని చెలగాటం వద్దు.. దాని జోలికి అస్సలు పోవద్దు” అంటూ ఘాటుగా హెచ్చరించారు. అంతేకాదు, “చైనా మాంజా దాచుకున్నా, అమ్మినా, వాడినా… చట్టం ఊరుకోదు, లోపలేస్తది!” అంటూ తనదైన మాస్ శైలిలో చట్టం పనితీరును గుర్తుచేశారు. ఎక్కడైనా దీని విక్రయాలు కనిపిస్తే వెంటనే 94906 16555 నంబరుకు వాట్సాప్ ద్వారా లొకేషన్, ఫోటో పంపాలని కోరారు.

“మిల్కే హైదరాబాద్ కో సేఫ్ బనాతే యారో” అంటూ సజ్జనార్ ఇచ్చిన పిలుపుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆయన ట్వీట్లను రీ-ట్వీట్ చేస్తూ #SayNoToChineseManja ఉద్యమంలో పలువురు నెటిజన్లు భాగస్వాములవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *