రైతాంగానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ. గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. శనివారం దర్శి నియోజకవర్గంలోని
దర్శి, ఉల్లగల్లు , పసుపుగల్లులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి స్వామితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్ధన రావు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, .బి.ఎన్.విజయ్ కుమార్, దర్శి నియోజకవర్గ టిడిపి
ఇంచార్జి, ప్రముఖ వైద్యురాలు గొట్టిపాటి లక్ష్మీ, యర్రగొండపాలెం ఇంచార్జి గూడూరి ఎరిక్షణ్ బాబు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ దర్శి పట్టణంలో రూ. 4.2 కోట్లతో డివిజన్ విద్యుత్ కార్యాలయానికి శంకుస్థాపన చేశామని, దీనిని 6 నెలల్లో పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా ఉల్లగల్లు లో 4.19 కోట్లు తో 33/11 కెవి సబ్ స్టేషన్ కి కూడా శంకుస్థాపన చేశామని, ఇది కూడా 6 నెలల్లో పూర్తి చెయ్యాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చామన్నారు. ఉల్లగల్లులో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని అందరితో కలిసి ప్రారంభించడం ఎంతో ఆనందగా ఉందన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి కొనియాడారు.ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకి ఉపయోగపడే ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, అందులో 2 రూపాయలకే కిలో బియ్యం , గురుకుల పాఠశాలలు, మహిళలకి ఆస్థిలో సగం హక్కు కల్పించడం , పక్కా ఇల్లు వాటివి ఉన్నాయన్నారు. అదే మార్గంలో ముఖ్యమంత్రి శ్రీ.చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడుతున్నారని ఆయన చెప్పారు.కృష్ణా – గోదావరి అనుసంధానం చేసి గోదావరి నీళ్లను కృష్ణ కి తీసుకువచ్చిన ఒక గొప్ప ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టమన్నారు. గత కూటమి ప్రభుత్వంలో
పోలవరం 71 శాతం పూర్తి చేసామని, మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక 84 శాతం పూర్తి చేశామన్నారు.
రాబోయే రోజుల్లో రాజధానిని కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రజలు కోరుకున్నట్లుగానే దర్శిని అద్దంకి రెవిన్యూ డివిజన్ లో కలపడం జరిగిందన్నారు. అదేవిధంగా దర్శి నియోజకవర్గాన్ని కూడా ప్రకాశం జిల్లాలో ఉంచామన్నారు. ముఖ్యమంత్రి , ఐటీ శాఖ మంత్రి లోకేష్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకున్నారని , నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వస్తాయన్నారు.
మంత్రి వీరాంజనేయస్వామి మాట్లాడుతూ దొనకొండలో బి డి ఎల్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, దొనకొండని పారిశ్రామికంగా అబివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంత అబివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. 2014-2019 కాలంలో దర్శికి డ్రైవింగ్ స్కూల్ మంజూరు చేస్తే గత ప్రభుత్వం దాన్ని నిలిపివేసిందని, మళ్లీ ఇప్పుడు దాన్ని కూడా పునఃప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని, దాని పనులు త్వరలో ప్రారంభం అవుతాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.200 కోట్లతో సంక్షేమ హాస్టళ్ళు,
గురుకులాల ఆధునీకరణకు నిధులు ఇచ్చిందన్నారు. రూ.100 కోట్లతో కొత్త భవనాలను నిర్మించామన్నారు. బీసీ, ఎస్.టి , మైనారిటీ హాస్టల్స్ కి మరో 200 కోట్లు రూపాయలు నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు. విద్యార్థులకి ఫీజు రీయింబర్స్ రెగ్యులర్ గా చెల్లిస్తున్నామన్నారు. ప్రైవేట్ కాలేజీ లకు కూడా ఫీజు రీయింబర్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని, అందులో మండల వ్యవస్థ గొప్పదన్నారు. రైతులకి మేలు చేసేలా కరణం, మునుసూబు వ్యవస్థల్ని రద్దు చేశారన్నారు. ఎన్నికల హామీలో బాగంగా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ను పోటీ స్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. అన్న క్యాంటీన్లు ద్వారా 5 రూపాయలకే పేదలకి అన్నం పెట్టడం గొప్ప విషయం అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎంపీ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ దర్శి లో విద్యుత్ డివిజన్ కార్యాలయానికి భూమి పూజ చెయ్యటం శుభ పరిణామమని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అబివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాగా భావించి పని చేస్తుందన్నారు. దర్శి అబివృద్ధి లో తన వంతు సహాయం చేస్తున్నాను అని ఎంపీ చెప్పారు.
ఎమ్మెల్యే జనార్ధన్ మాట్లాడుతూ గడిచిన 18 నెలల్లో కూటమి ప్రభుత్వం అనేక అబివృద్ధి, సంక్షేమం పథకాలను అమలు చేసిందన్నారు. దర్శి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఎటువంటి తగాదాలు, గొడవలు, భూ కబ్జాలు లేకుండా ప్రశాంతంగా పరిపాలన సాగుతున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ స్పూర్తితో రాష్ట్ర అభివృద్ధికి అందరూ తమవంతు బాధ్యత నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మట్లాడుతూ దర్శిలో కూటమి ప్రభుత్వ హయాంలో సబ్ స్టేషన్లు , రోడ్లు, కాలువలు, మంచి నీటి ట్యాంకులు వచ్చాయన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించి అధికార యంత్రాంగాన్ని ప్రజలకు చేరువచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అబివృద్ధి, సంక్షేమంతో ముందుకు వెళ్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాకూడా చెప్పినవి చెప్పినట్టు చేస్తున్నామన్నారు. అన్ని నియోజకవర్గాలలో జరుగుతున్న అభివృద్ధి పనులే దీనికి నిదర్శనం అన్నారు.
గొట్టిపాటి.లక్ష్మీ మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి పూర్తి చేస్తున్నామన్నారు. వాటితో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా నూతనంగా ప్రారంభించిన అభివృద్ధి పనులను ఆమె ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాపారావు, ఏపీ సిపిడిసిఎల్ ఎస్.ఈ. కట్టా వెంకటేశ్వర్లు, ఈ.ఈ. పాలగిరి శ్రీనివాసులు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


