ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు నేరాలు నియంత్రణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసు శాఖ క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం వలన ప్రజలకు కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, అటువంటి చర్యలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో ఈ కార్యాచరణ కొనసాగించబడింది.
గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీలు, నిఘా చర్యల ఫలితంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. రహదారులపై, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు, పార్కులు వంటి ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో మద్యం సేవించి అల్లర్లకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడాన్ని అడ్డుకోవడం ద్వారా రోడ్లపై అకతాయిల అల్లర్లు, చిన్న చిన్న ఘర్షణలు, మహిళలు మరియు వృద్ధులకు కలిగే ఇబ్బందులు గణనీయంగా తగ్గుముఖం పడతాయని పోలీసు శాఖ భావిస్తోంది. ప్రజల భద్రతకు భంగం కలిగించే ఏ చర్యనైనా సహించబోమన్నారు.
అదే విధంగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న ప్రాంతాలను ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటివరకు 219 ప్రదేశాలను గుర్తించి వాటిని శుభ్రం చేయడంపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 219 ప్రదేశాలను గుర్తించగా, వాటిలో 169 ప్రదేశాలను ఇప్పటికే శుభ్రం చేయడం జరిగింది. మిగిలిన ప్రదేశాలను కూడా శుభ్రపరిచే కార్యక్రమం కొనసాగుతోంది.
దేవాలయాలు పక్కన, పాఠశాలల సమీపంలో, కాలనీల మధ్యలో గుబురుగా పెరిగిన చెట్లు, పొదలు, చెత్త పేరుకుపోయిన ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అనుకూలంగా మారుతున్నాయని గుర్తించిన పోలీసులు, స్థానిక ప్రజల సహకారంతో ఆ ప్రాంతాలను శుభ్రం చేయిస్తున్నారు. పోలీసు సిబ్బంది స్వయంగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా మార్చడం ద్వారా అక్కడ మళ్లీ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వలన నేరాలకు అవకాశం తగ్గుతుందని, సమాజంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మీ కళ్ల ముందే ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి ఇబ్బందులు కలిగిస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. అదేవిధంగా, మీ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా వీడియో రికార్డు చేసి పోలీసు శాఖ వాట్సాప్ నెంబర్ 9121102266 కు పంపవచ్చని, లేదా 112 కు డయల్ చేయవచ్చని తెలియజేస్తున్నారు. ప్రజలు అందించే సమాచారాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు.

