77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తో కలసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టరేట్ లో నూతనంగా ఏర్పాటుచేసిన నాలుగు సింహాల స్థుపాన్ని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కలెక్టరేట్ సిబ్బందికి, ఇతర శాఖల సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నానన్నారు. ఎందరో త్యాగధనులు, అమర వీరుల త్యాగం వలన మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మనకు మనం గొప్ప రాజ్యాంగాన్ని రచించుకుని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆత్యున్నతమైన రాజ్యాంగంగా, పెద్ద రాజ్యాంగంగా ఏర్పాటుచేసుకుని ఈ రోజు ప్రపంచ పటంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నామన్నారు. 2047 విజన్ తో భారత దేశం ముందుకు పోతున్నదని, ఆ విజన్ లో మనం ప్రపంచంలో మొదటి స్థానంలో నిలవాలన్న లక్ష్య సాధనలో దేశ ప్రధాని గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు.
జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాల క్రిష్ణ మాట్లాడుతూ, ఈ రోజు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెల్పుతూ, మన రాజ్యాంగాన్ని అమలు చేసుకుని నేటికి 76 సంవత్సరాలు పూర్తీ చేసుకుని, 77 సంవత్సరంలోని అడుగుపెట్టామన్నారు. ఈ 76 సంవత్సరాల్లో అనేక రంగాల్లో దేశం గాని, రాష్ట్రంలో గాని, జిల్లా లో గాని అభివృద్ధి పదంలో నడిచిందన్నారు. ఇంకా మనం ఎన్నో మైలు రాళ్ళ ను అందుకోవాల్సి ఉందన్నారు. ఆ దిశగా మనమంతా మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, సిపి సుధాకర్ రెడ్డి, జిల్లా విద్యా శాఖాధికారి రేణుక, జిల్లా పౌర సరఫరా అధికారి పద్మశ్రీ కలెక్టరేట్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

