హైదరాబాద్ మార్చి 19
(జే ఎస్ డి ఎం న్యూస్) :
కోకాపేట విశాఖ శ్రీ శారదా పీఠంలోని శ్రీ రాజ శ్యామల అమ్మవారి దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పీఠం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ శారదా చంద్ర మౌలీశ్వర ఆరాధనతో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం గాయని నిత్య సంతోషిణి మరియు బృందం సమర్పించిన భక్తి సంగీత విభావరి భక్తులకు ఆధ్యాత్మిక పరవశం అందించింది. తరువాత విశాఖ శ్రీ శారదా పీఠం గంటల పంచాంగాన్ని ఘనంగా ఆవిష్కరించారు. పంచాంగ శ్రవణం కార్యక్రమంలో చిర్రావూరి విజయనాథ్ శర్మ నూతన సంవత్సర ఫలితాలను వివరించారు.అనంతరం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా
మహాస్వామి మాట్లాడుతూ, విశాఖ శ్రీ శారదా పీఠంలో జరిగే ప్రతీ కార్యక్రమం రాష్ట్ర శ్రేయస్సు, దేశ క్షేమం కోసమే నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి
చెందాలని, తెలుగు ప్రజలు అత్యున్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు. దేశ ప్రజలందరూ
సుఖసంతోషాలతో ఉండాలని, దేశ శ్రేయస్సే ముఖ్య ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తరువాత వేడుకలకు హాజరైన భక్తులకు ఉగాది పచ్చడి, మహా ప్రసాదం పంపిణీ చేశారు.ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలు భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్నిపెంపొందించడంతో పాటు, సాంప్రదాయ విలువలను మరింత బలపరిచాయి. విశాఖ శ్రీ శారదా పీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలు భక్తులకు నూతన సంవత్సరానికి ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించాయి. భక్తుల భారీ సంఖ్యలో పాల్గొనడంతో ఈ ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి.
ఈ వేడుకల్లోతెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్,
జస్టిస్ రామకృష్ణ రెడ్డి, పట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు & వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రక్షణ & వ్యూహాత్మక వ్యవహారాల సలహాదారు, నేషనల్ సెక్యూరిటీ బోర్డ్ మెంబర్, డీఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి,ఎన్సీఎల్టీ న్యాయ సభ్యుడు జస్టిస్ బద్రీనాథ్ ,మాజీ న్యాయమూర్తి మఠం వెంకటరమణ,హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ,బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మురళీధర్ రావు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్,తెలంగాణ మాజీ డీజీపి అంజన్ కుమార్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ప్రసిద్ధ గజల్ గాయకుడు ఘజల్ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



