హైదరాబాద్ ఏప్రిల్ 5
(జే ఎస్ డి ఎం న్యూస్) :
భారత స్వాతంత్ర్య సమరయోధుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు. లాలాపేట్‌లోని ఇసుక బావి, శాంతినగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి స్మరించారు. ఈ సందర్భంగా శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహానేత అని, ముఖ్యంగా దళితులు మరియు అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు అపారమని కొనియాడారు. కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా సేవలందించిన ఆయన పరిపాలనా నైపుణ్యం దేశ అభివృద్ధికి దోహదపడిందని గుర్తు చేశారు. సమానత్వం, సామాజిక న్యాయం, సర్వ సమాన హక్కుల సాధనలో ఆయన చూపిన మార్గం నేటి తరానికి దారి దీపమని పేర్కొన్నారు. అలాగే యువత బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజంలో సమానత్వం, సహోదర భావం పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

