యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు -శాంతి భద్రతలను కాపాడవలసిన వారు అక్రమ సంపాదనకు అలవాటు పడితే కఠిన చర్యలు తప్పవు….డి జి పి శివధర్ రెడ్డి.

హైదరాబాద్ ఏప్రిల్ 8
(జే ఎస్ డి ఎం న్యూస్) :
పోలీసు యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు.
శాంతి భద్రతలను కాపాడవలసిన వారు అక్రమ సంపాదనకు అలవాటు పడితే కఠిన చర్యలు తప్పవు అంటూ తెలంగాణ రాష్ట్ర డి జి పి శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలీస్ సిబ్బందికి రాసిన లేఖలో స్పష్టంగా హెచ్చరించారు.
హోమ్ గార్డు నుంచి ఐపీఎస్ అధికారి వరకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో, పారదర్శకతతో పనిచేయాలని, పోలీస్ స్టేషన్లకు వచ్చే పేదలు, బలహీన వర్గాల పట్ల సానుభూతితో వ్యవహరించి వారికి న్యాయం చేయాలని డిజిపి తన లేఖలో స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లను సివిల్ సెటిల్మెంట్లకు వేదికలు గా మార్చవద్దని, క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదని, ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. అయితే డీజీపీ స్థాయి అధికారి ఇలాంటి కఠిన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు తమ పాత పద్ధతులను మార్చుకోవడం లేదనే విషయం ఇటీవల రాష్ట్రంలో ఏసీబీ వరుస దాడులలో స్పష్టమవుతోంది.
ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా పర్యవేక్షణలో అవినీతి నిరోధక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా తన వేగాన్ని పెంచింది. తాజాగా, శంషాబాద్‌లోని ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ అవుట్‌పోస్టులో ఇన్‌స్పెక్టర్ సంపాతి కనకయ్య, ఎస్సై యు.కె. సిద్ధేశ్వర్ ఒక కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు, నిందితుల కుటుంబ
సభ్యులను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. 5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రూ. 2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని వలపన్ని పట్టుకున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఇన్‌స్పెక్టర్ నివాసంలో సోదాలు చేయగా ఏకంగా రూ. 33,97,000 నగదు లభ్యమైంది. వీరిని బుధవారం రిమాండ్ కు తరలించారు. అలాగే మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఆర్మ్డ్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు ప్రమోద్ గౌడ్, జాతావత్ బాబు నాయక్ ఒక సైబర్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.అవినీతి జాడ్యం కేవలం నగరాలకే పరిమితం కాకుండా జిల్లాల్లోనూ కొనసాగుతుండటం గమనార్హం. నిర్మల్ జిల్లా మామడ ఎస్సై టి. అశోక్ తనపై ఉన్న ఫిర్యాదును మాఫీ చేసేందుకు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడగా, మాదాపూర్ ఎస్సై గాండ్ర వినయ్ నోటీసులు ఇచ్చేందుకు రూ. 50 వేలు డిమాండ్ చేసి ఏసీబీ వలలో చిక్కారు.వరంగల్‌లోని కేయూసీ ఎస్సై పి. శ్రీకాంత్ సీజ్ చేసిన వాహనాల విడుదల కోసం తన ప్రైవేట్ డ్రైవర్ ద్వారా రూ. 15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని ములుగు ఎస్సై విజయ్ కుమార్ రూ. 50 వేలు, మెదక్ జిల్లా టేక్మల్ ఎస్సై రాజేష్ నోటీసుల జారీ కోసం రూ. 30 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. టేక్మల్ ఎస్సై అయితే ఏసీబీ అధికారులను చూసి పొలాల్లోకి పారిపోగా, అధికారులు వెంటాడి పట్టుకొన్నారు. ఇప్పటికైనా పోలీసు సిబ్బంది తమ పనితీరును మార్చుకొని, డిజిపి తన లేఖ లో ఆశించినట్లుగా “ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ మరియు ప్రొఫెషనల్” పోలీసింగ్ వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెనుకాడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీజీ చారుసిన్హా ప్రజలను కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *