మహిళల భద్రత, రక్షణకే తొలి ప్రాధాన్యత కల్పించాలి – రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా పోలీసు అధికారులతో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కనిగిరిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాకు సంబంధించిన భౌగోళిక పరిస్థితులు, పోలీసు పరిపాలనా విభజన, సర్కిళ్లు, మండలాల పరిధి, శాంతిభద్రతలు, నేర నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, మహిళలు, బాలికల భద్రత, రక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, మైనర్ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీసు శాఖ ప్రతిష్టను పెంచే విధంగా అధికారులు తమ విధులను నిర్వహించాలని సూచించారు.

పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితులకు న్యాయం చేయడంతో పాటు, వారి పట్ల సానుకూలంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించాలని తెలిపారు.

ఫింగర్ ప్రింట్ పరికరాలు, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర నియంత్రణలో మరింత విస్తృతంగా వినియోగించాలని సూచించారు. నిందితులకు శిక్షించబడేలా దర్యాప్తు చేపట్టి, మంచి పోలీసింగ్ ద్వారా నేరస్థుల్లో భయాన్ని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించే అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలని, ఎవరైనా నేరాలకు పాల్పడితే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలను వారికి అర్థమయ్యే విధంగా వివరించాలని సూచించారు. నిరంతర వాహన తనిఖీలు నిర్వహిస్తూ, గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.

మైనర్ బాలికలపై జరుగుతున్న నేరాలకు గల కారణాలను విశ్లేషించి, వాటి నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులను మంత్రి కోరారు. ఇటీవల జరిగిన బస్సు రోడ్డు ప్రమాద ఘటనలో పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారని ప్రశంసించారు.

మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, మహిళలు, బాలికలకు సంబంధించిన నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ, నేర ప్రవృత్తులపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

మహిళలపై జరిగే నేరాల దర్యాప్తును నిర్ణీత గడువులో పూర్తి చేసి, న్యాయస్థానాల్లో అభియోగ పత్రాలు దాఖలు చేస్తున్నామని తెలిపారు. పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా ప్రత్యేక చర్యలు చేపట్టిన ఫలితంగా శిక్షల శాతం పెరిగిందన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కుంభాకార దర్పణాలు (Convex Mirrors) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శక్తి టీమ్స్, డ్వాక్రా సంఘాల సభ్యుల ద్వారా మహిళల భద్రత, చట్టాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా నిర్వహిస్తున్నామని, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్లు (NBWs) అమలు చేసి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న నిందితులను కూడా అరెస్టు చేసినట్లు వివరించారు. అలాగే, చెడు నడత కలిగిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి, నేరాల నివారణకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర హోం మంత్రి కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సమావేశంలో మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు, కనిగిరి ఇన్‌చార్జి డీఎస్పీ పి. శ్రీధర్, సిఐలు పాల్గొన్నారు.

ముందుగా కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ నందు నిర్వహించనున్న భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ముందస్తు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు జిల్లా ఎస్పీ గారు పలు సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *