హైదరాబాద్, జూన్ 21:(జె ఎస్ డి ఎం న్యూస్) : అమీర్‌పేట్ డివిజన్‌కు చెందిన ప్రముఖ బీఆర్ఎస్ నాయకుడు జితేంద్రనాథ్ శుక్లా అకాల మరణం పట్ల రాష్ట్ర బీజేపీ యువ నాయకుడు మర్రి పురురవ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం శుక్లాకు అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ విషయం తెలుసుకున్న మర్రి పురురవ రెడ్డి వెంటనే స్పందించి, మధ్యాహ్నం బల్కంపేట్ బీజేఆర్ నగర్‌లోని హిందూ శ్మశాన వాటికలో జరిగిన శుక్లా అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అక్కడ ఆయన భౌతిక దేహంపై పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం శ్మశాన వాటికలోనే ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, తన గాఢ సానుభూతిని తెలియజేస్తూ వారిని ఓదార్చారు.
ఈ సందర్భంగా మర్రి పురురవ రెడ్డి మాట్లాడుతూ జితేంద్రనాథ్ శుక్లాతో మర్రి కుటుంబానికి దశాబ్దాల కాలంగా అత్యంత సన్నిహిత అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. గతంలో శుక్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, 1989 శాసనసభ ఎన్నికల సమయంలో నాటి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విజయానికి ఎంతో చురుకైన పాత్ర పోషించారని కొనియాడారు. కేవలం చెన్నారెడ్డి గారితోనే కాకుండా, మర్రి శశిధర్ రెడ్డితో కూడా ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉండేదన్నారు. ప్రస్తుతం ఆయన కుమార్తె నవీన శుక్లా సైతం బీజేపీ మహిళా విభాగంలో క్రియాశీలక నాయకురాలిగా కొనసాగుతూ, తమతో కలిసి పార్టీ బలోపేతానికి ఎంతో చక్కగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా పురురవ రెడ్డి పేర్కొన్నారు. జితేంద్రనాథ్ శుక్లా అంతిమ సంస్కారాల కార్యక్రమంలో అమీర్‌పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు నక్క శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పార్టీ నాయకులు బిక్షపతి గౌడ్, రాజు గౌడ్, పి. నరేందర్, వంశీ కృష్ణ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
