ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో అభివృద్ధి పరంగా కొత్తపట్నంతో పాటు మొత్తం తీర ప్రాంత ముఖచిత్రమే మారిపోతుంది – ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి

ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ద్వారా అభివృద్ధి పరంగా కొత్తపట్నంతో పాటు మొత్తం తీర ప్రాంత ముఖచిత్రమే మారిపోతుందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి మంగళవారం ఆయన పల్లెపాలెంలో ఈ హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి మొత్తం నాలుగు హార్బర్లు మంజూరు కాగా, వాటిలో ఒకటి కొత్తపట్నం మండలానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. అయితే నిర్మాణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాపై అస్పష్టత వలన పనులు ప్రారంభించడం కొంత జాప్యం జరిగిందన్నారు. హార్బర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున నిర్మాణ వ్యయంలో అధిక వాటా భరిస్తున్నట్లు చెప్పావు. రూ.441 కోట్లలో కేంద్రం వాటా 150 కోట్లు ఉందన్నారు. త్వరగా హార్బర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీని శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తీసుకురావడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ హార్బర్ తో పాటు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే ఎయిర్పోర్ట్ కూడా వస్తుందన్నారు. వాటికి అనుగుణంగా హోటళ్లు,
రిసార్ట్లు కూడా ఈ ప్రాంతానికి తరలివస్తాయన్నారు. మొత్తంగా చూస్తే తీర ప్రాంతం ఆధారంగా అభివృద్ధి మరింత పుంజుకోనున్నదని ఎమ్మెల్యే చెప్పారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని తీర ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా పల్లెపాలెం నుంచి మడనూరు వరకు సముద్ర తీరంలో ప్రత్యేక వాహనాల్లో వీరు పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు.
ఈ పర్యటనలో వీరి వెంట ఏఎంసి చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *