సికింద్రాబాద్ ఆగస్ట్ 3,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలున్నాయి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. అగ్నిప్రమాదాలూ ఉన్నాయి. ప్రాణనష్టం కూడా జరుగుతుంది. ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని రంగంలో అమ్మవారి భక్తురాలు స్వర్ణలత భవిష్యవాణిలో సూచించారు. వావివరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారని, తల్లితండ్రులు కూడా పిల్లల్ని విచ్చల విడిగావదిలేస్తున్నారని, కళ్లు తలకెక్కి ఘోరాలు చేస్తుంటే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని హెచ్చరించారు. సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళీ బోనాల మహోత్సవాలలో సోమవారం రంగం, భవిష్యవాణి ఆసక్తి కరంగా సాగింది. మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, ఈఓ మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తూ.నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాటతీసుకుంటున్నారు కానీ చెయ్యడం లేదు. నా ఆగ్రహానికి గురవుతున్నారు. నేను సంతోషంగా వచ్చానుఅనుకుంటున్నారా..? కోపంతో వచ్చాను నేను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మాట ప్రకారమే సంతోషంగా, ఆనందంగా సరిపెట్టుకుంటున్నాని చెప్పారు. ఏ ప్రమాదాలొచ్చినా ‘నా బాలలందరిని కాపాడుకుంటున్నానని భరోసా ఇచ్చారు. మీరు మాత్రం కంట తడిపెట్టిస్తున్నారని, మనసు తృప్తి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆరు నెలలో విగ్రహ ప్రతిష్ఠ చేయాలని సూచించారు. విగ్రహ ప్రతిష్ఠ చేస్తే కోరిన కోర్కెలు కొంగుబంగారం చేస్తానన్నారు. ఆరు నెలల్లో చేయకపోతే వాడవాడల ప్రాణనష్టం కూడా జరుగుతూనే ఉంటుందని అన్నారు. అడ్డచ్చే వారిని పాదాలకింద నలిపేస్తానని హెచ్చరించారు.

