సనత్ నగర్ ఆగస్టు8,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాష్ట్రంలో అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు
పడుతున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. శనివారం సనత్ నగర్ లోని సి టైప్ క్వార్టర్స్ లో కాలనీ ప్రజల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన రేకుల షెడ్డు ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి, 2014 లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే జరిగిందని చెప్పారు. తాను సనత్ నగర్ ఎమ్మెల్యే గా వచ్చిన తర్వాత రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ, వాటర్ లైన్ ల అభివృద్ధి వంటి పనులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రిజర్వాయర్ ను నిర్మించినట్లు వివరించారు. ప్రభుత్వం చేపట్టాల్సిన అభివృద్ధి పనులను కూడా దాతల సహకారంతో చేయాల్సిన దుస్థితి కాంగ్రెస్ పాలనలో ఏర్పడిందని మండిపడ్డారు. 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు త్రాగునీరు, విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 కు ముందు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఆలయం లోపల నిర్వహించేవారని చెప్పారు. తాను వచ్చిన తర్వాత ఆలయం ముందు భారీ రేకుల షెడ్డు నిర్మించి దాని క్రింద లక్షలాది మంది భక్తులు వీక్షించేలా కళ్యాణం నిర్వహిస్తు వస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆలయాన్ని ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసి పుణ్యక్షేత్రాన్ని తలపించేలా తీర్చిదిద్దినట్లు వివరించారు. మున్సిపల్, హోం, ఎడ్యుకేషన్ తదితర శాఖలన్ని ముఖ్యమంత్రి వద్దే ఉన్నా రెండున్నర సంవత్సరాల నుండి ఎలాంటి సమీక్షలు చేయకపోవడం, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కి ప్రతిపక్షాలను బూతులు తిట్టడంలో ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారం లో లేదని విమర్శించారు. మన సంస్కృతి, ఆచారాలు ఎంతో గొప్పవని, దేశ విదేశాలలో గౌరవిస్తూ ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. నేటి తరం పిల్లలకు మన పండుగల విశిష్టత, మన సాంప్రదాయాల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాలనీ వాసులు అంతా కలిసి మెలసి ఉండాలని, తరచు సమావేశాలు నిర్వహించుకోవాలని అన్నారు. కాలనీలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో కాలనీ ఓటర్లు పాల్గొని తమ వివరాలను అధికారులకు సమర్పించాలని కోరారు. ఈ నెల 10 వ తేదీతో గడువు ముగుస్తుందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడువు లోగా వివరాలు సమర్పించకుంటే ఓటు తొలగించే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ముందుగా రేకుల షెడ్డు నిర్మాణం చేయించిన దాడి ప్రవీణ్ రెడ్డి ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సన్మానించారు.కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి,నాయకులు ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రమేష్ గౌడ్, ఖలీల్, రాజేష్ ముదిరాజ్, అనంత రెడ్డి, శేఖర్, అశోక్ యాదవ్, జమీర్, కాలనీ వాసులు సంజయ్, విజయలక్ష్మి, మాణిక్ రావు, పార్థసారధి, హరిసింగ్, పురుషోత్తం తదితరులు ఉన్నారు.

