హైదరాబాద్ ఆగస్టు 9,(జె.ఎస్.డి ఎం న్యూస్) :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బోనాల పండుగ అని గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు.బోనాల సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. తార్నాక డివిజన్‌తో పాటు సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. భక్తులతో కలిసి బోనాల ఉత్సవాల్లో పాల్గొని, అమ్మవారికి బోనం సమర్పించారు.ఈ సందర్భంగా తార్నాక డివిజన్లోని హనుమాన్ నగర్లో నిర్వహించిన బోనాల వేడుకల్లో ప్రత్యేకంగా బోనం ఎత్తుకున్న మోతె శ్రీలత శోభన్ రెడ్డి, అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు, సాంస్కృతిక వారసత్వానికి బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో బోనాల ఊరేగింపులు, భక్తి కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి.

