బేగంపేట ఆగస్ట్ 11,(జే ఎస్ డి ఎం న్యూస్) :
మన సంస్కృతి, సాంప్రదాయాలు
ఎంతో గొప్పవని, వాటిని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆషాడ బోనాల ఉత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి బేగంపేట లోని మయూరి మార్గ్ లో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు నిర్వహించారు. నిర్వాహకులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సాంస్కృతిక, సాంప్రదాయాలను దేశ విదేశాలలో గౌరవిస్తూ పాటిస్తున్నారని చెప్పారు. బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ఉమ్మడి రాష్ట్రంలో డిమాండ్ చేసినా స్పందన లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి స్వయం పాలన వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. బోనాలను ఘనంగా నిర్వహించాలనే ఆలోచనతో ప్రయివేటు దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందించిన ఘనత కేసీఆర్ కే దక్కిందని చెప్పారు. జంటనగాలలోని సుమారు 3800 దేవాలయాలకు 20 కోట్ల రూపాయలు అందించినట్లు వివరించారు. మన పండుగల విశిష్టత, వాటి చరిత్ర గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టి. మహేశ్వరి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీహరి, నిర్వాహకులు శివ, వినయ్, నాగరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

