హైదరాబాద్ ఆగస్ట్ 11,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
లాల్‌దర్వాజ లో 9,10తేదీలలో జరిగిన బోనాల ఉత్సవాలు సందర్భంగా భక్తులు,
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని నేరాల నియంత్రణ కోసం డీడీ సీసీఎస్ స్పెషల్ క్రైమ్ బృందాలను బందోబస్తులో రంగంలోకి దించినట్లు హైదరాబాద్ నగర అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్స్ & సిట్) యం. శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేరాల నివారణ చర్యల్లో భాగంగా స్పెషల్ క్రైమ్ టీమ్ ఉత్సవ ప్రాంతం మరియు
పరిసరాల్లో ముమ్మర నిఘా, విస్తృత తనిఖీలు ద్వారా అనుమానిత వ్యక్తుల పరిశీలన చేపట్టిందని పేర్కొన్నారు. ముఖ్యంగా పాత నేరస్థులు, అలవాటుపడిన నేరగాళ్లు (Habitual Offenders), మోడస్ ఒపరాండీ (M.O) నేరగాళ్లు, ఆస్తి సంబంధిత నేరస్థులు, గతంలో నేర చరిత్ర ఉన్నవారి కదలికలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించినట్లు తెలిపారు. ప్రధాన ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, రద్దీగా ఉండే ప్రాంతాలు మరియు నేరాలకు ఆస్కారమున్న సున్నితమైన ప్రదేశాలలో ప్రత్యేక నిఘా ఉంచామని, అనుమానాస్పద కదలికలను గుర్తించడానికి మఫ్టీ పోలీసులను రంగంలోకి దించినట్లు వివరించారు. చోరీలు, చైన్ స్నాచింగ్‌లు,జేబుదొంగతనాలు మరియు ఆస్తిసంబంధిత నేరాల నివారణే ధ్యేయంగా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.ఈ ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా స్పెషల్ క్రైమ్ బృందం మొత్తం 116 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని సమగ్ర విచారణ జరిపినట్లు అడిషనల్ సీపీ తెలిపారు. ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) కెమెరాలు మరియు పోలీస్ శాఖ నేరస్థుల డేటాబేస్ ద్వారా వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించగా, వీరిలో 8 మంది పాత నేర చరిత్ర కలిగిన వ్యక్తులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఆయన తెలిపారు.స్పెషల్ క్రైమ్ టీమ్ ,స్థానిక పోలీసుల సమన్వయంతో ఉత్సవాల్లో శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమైందని, పటిష్టమైన నిఘా మరియు ముందస్తు చర్యల వల్ల ఉత్సవ పరిసరాల్లో ఎలాంటి సెల్‌ఫోన్ చోరీలు, గొలుసు దొంగతనాలు లేదా చైన్ స్నాచింగ్ ఘటనలు నమోదు కాలేదని యం. శ్రీనివాస్ స్పష్టం చేశారు. పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ.. పౌరులంతా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ
తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని, ఎలాంటి అనుమానాస్పద కదలికలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో 116 మంది అనుమానితులు అదుపులోకి తీసుకున్నాం. హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్. హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్ & సిట్) యం. శ్రీనివాస్ వెల్లడి.
11
Aug