హైదరాబాద్ ఆగస్ట్ 11,(జే ఎస్ డి ఎం న్యూస్) :
జూబ్లీహిల్స్లో కలకలం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రాయ్ వినయ్ రంజన్ భార్య శ్రీమతి తనుజా రంజన్ (62) దారుణ హత్య, దోపిడీ కేసులో ప్రధాన నిందితుడైన నేపాల్ ముఠా సభ్యుడిపై హైదరాబాద్ నగర పోలీసులు పీడీ యాక్ట్ (PD Act) ప్రయోగించారు. నేపాల్లోని అచ్చామ్ జిల్లాకు చెందిన నిందితుడు సునీల్ బహదూర్ ఔజీ అలియాస్ సునీల్ పరియార్ (29)పై తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు జూబ్లీహిల్స్ సి ఐ మంగళవారం వెల్లడించారు.నిందితుడు
పథకం ప్రకారం తనుజా రంజన్ నివాసంలోకి చొరబడి ఆమెను బంధించి, ఊపిరాడకుండా చేసి కిరాతకంగా హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. ఈ కేసులో 2026 మే 22న అరెస్ట్ అయిన నిందితుడిపై గుజరాత్, మహారాష్ట్రలలో కూడా అంతర్రాష్ట్ర దోపిడీ కేసులు నమోదై ఉన్నాయన్నారు. సమాజ భద్రత, నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకుని నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ అమలు చేశామని, ఇటువంటి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
