స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ఆధారంగా రిజర్వేషన్ సీట్లను నిర్ణయించాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల సర్వే సమర్థంగా పూర్తి చేయాలన్నారు. తదుపరి సీట్లను నిర్ధారించాలన్నారు. ఎన్నికల సామగ్రి కొనుగోలు చేపట్టాలన్నారు. రాష్ట్రం నుంచి ఎన్నికల సామాగ్రి కేటాయింపు ఉంటుందని, మిగతావి స్థానికంగా కొనుగోలు చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందస్తుగా గుర్తించి, బందోబస్తు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు సమకూర్చుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని మందస్తుగానే ఏర్పాటు చేసుకోవాలని పలు సూచనలు చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలకాగానే అభ్యంతరాలు స్వీకరించి, తుది జాబితాకు చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు అనుసరించి గ్రామ పంచాయతీలలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్థానిక సభ్యుల ఎన్నికల ఏర్పాట్లకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు ఉత్పన్నంగాకుండా ప్రణాళికతో అధికారులు పనిచేయాల్సి ఉంటుందని వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారి, డిపిఓ అనుపమ, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఈఓ బాలమ్మ, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

