వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది సీఎం చంద్రబాబు నాయుడేనని, ప్రారంభోత్సవం చేస్తోంది చంద్రబాబు నాయుడేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో వెలిగొండ నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ 200 కోట్ల పరిహారం చెక్కును అందజేశారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల 30 ఏళ్ల కలను సీఎం చంద్రబాబు నిజం చేశారన్నారు.కూటమి ప్రభుత్వం ప్రాజెక్ట్ పనులతోపాటు నిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నదని చెప్పారు. అందులో భాగంగా తొలి విడత రూ.318 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. నేడు రెండో విడతగా మరో రూ. 200 కోట్లు అందజేశామన్నారు. మిగిలిన రూ. 400 కోట్లు నిర్వాసితులకు త్వరలోనే చెల్లించి ఈ నెలలోనే నల్లమల్ల సాగర్ కు నీరిస్తామన్నారు. వెలుగొండ నిర్వాసితులను గొడ్డలి పార్టీ దారుణంగా మోసగించిందని, పూర్తికాని ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనత ఆ పార్టీ నాయకుడికే చెల్లిందన్నారు. చెప్పినట్లే మార్కాపురం జిల్లా చేశామని, వెలుగొండకు శంకుస్థాపన చేసిన చంద్రబాబే తిరిగి ప్రారంభిస్తున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

