ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఒంగోలు టాస్క్ఫోర్స్ పోలీసులు పేకాట, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనమనమేళ్లూరు పంచాయతీ గ్రామ శివారులో 19 న సాయంత్రం టాస్క్ఫోర్స్ సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సి. చెంచయ్య మరియు సిబ్బంది పేకాట స్థావరంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
ఈ దాడులో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.28,420/- నగదు మరియు 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని, స్వాధీనం చేసుకున్న నగదు, మొబైల్ ఫోన్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మద్దిపాడు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ ఘటనపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో ఎక్కడైనా పేకాట, జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే, ప్రజలు వెంటనే డయల్ 112కు లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు మెసేజ్ ద్వారా సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ప్రజలు అందించే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
