హైదరాబాద్ ఆగస్టు 31,(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణలోని అమృత్ స్టేషన్లలో పునరాభివృద్ధి పనులను కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం పరిశీలించారు.
శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ హాల్ట్, గద్వాల్,మహబూబ్‌నగర్ ,జడ్చర్ల రైల్వే స్టేషన్లలోజరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యులు డి.కె. అరుణ, శాసన సభ్యులువిజయుడు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వెంట హైదరాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ మరియు ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. జి. కిషన్ రెడ్డి బాల బ్రహ్మేశ్వర జోగులాంబ హాల్ట్, గద్వాల్,మహబూబ్‌నగర్ మరియు జడ్చర్ల రైల్వే స్టేషన్ల సందర్శనసందర్భంగా, అక్కడ
జరుగుతున్న స్టేషన్ పునరాభివృద్ధి పనులను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ఆయన స్టేషన్లలోని నిర్మాణం పురోగతిలోనున్న ప్రాంతాలను సందర్శించి, పాటిస్తున్న భద్రతా చర్యలను కూడా గమనించారు. కేంద్ర మంత్రి నూతనంగా పునరాభివృద్ధి చేసిన సౌకర్యాలు, స్టేషన్ భవన నిర్మాణం, ప్లాట్‌ఫారమ్‌లు,
పాదచారుల వంతెనలు , పార్కింగ్, స్టేషన్ ప్రాంగణం , లిఫ్టులు మొదలైనవాటిని పరిశీలించారు
అనంతరం, రైల్వే స్టేషన్ల వద్ద మీడియా ప్రతినిధులను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను రూ. 2000 కోట్లకు పైగా వ్యయంతో అమృత్ స్టేషన్లుగాపునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ హాల్ట్, గద్వాల్ , మహబూబ్‌నగర్ మరియు జడ్చర్ల రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి మొత్తం రూ . 125.38 కోట్ల వ్యయంతో పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. స్టేషన్లలో కొత్త స్టేషన్ భవనాలు, ఆధునికీకరించిన వేచి ఉండే హాళ్లు, బుకింగ్ కౌంటర్లు, మెరుగైన ప్లాట్‌ఫారాలు, స్టేషన్ లైటింగ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, పాదచారుల వంతెన, మెరుగైన స్టేషన్ ప్రాంగణం, స్టేషన్ ముఖద్వారం మరియు పార్కింగ్ సౌకర్యాలు వంటి ప్రపంచ స్థాయి సదుపాయాలు, ఆధునిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఎస్బిబి జోగులాంబలో పనులు దాదాపుగా పూర్తయ్యాయని, ఇతర స్టేషన్లలో కూడా పనులు శర వేగంగాపురోగమిస్తున్నాయని తెలిపారు.
అంతేకాకుండా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రైల్వే మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని కిషన్ రెడ్డి తెలియ జేశారు. కొత్త లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్, సామర్థ్య పెంపు పనులు మొదలైన వాటితో సహా దాదాపు రూ . 50,000 కోట్ల విలువైన ప్రధాన రైలు అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్రవ్యాప్తంగా వేగంగా పురోగమిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 100 కొత్త ప్యాసింజర్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టినట్లు కూడా ఆయన తెలిపారు. బడ్జెట్లో ప్రకటించిన ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్లలో మూడు తెలంగాణకు సంబంధించినవేనని తెలిపారు. అవి విజయవాడ మీదుగా హైదరాబాద్ – చెన్నై, హైదరాబాద్–బెంగళూరు మరియు ముంబై మీదుగా హైదరాబాద్–పుణె. ఈ హై-స్పీడ్ ఎలివేటెడ్ రైలు కారిడార్లు తెలంగాణకు ఒక గేమ్ ఛేంజర్‌గా నిలుస్తాయని, ఇవి ప్రాంతీయ అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని, పారిశ్రామిక వృద్ధికి తోడ్పడతాయని, హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడతాయని, తద్వారా తెలంగాణకు ఇది ఒక పరివర్తనాత్మక అభివృద్ధిగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలోని ప్రతి ప్రాంతంలో రైల్వే అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి, అలాగే ఆలంపూర్, జోగులాంబ మరియు గద్వాల్ వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలకు ఆధునిక, సమర్థవంతమైన అనుసంధానం కల్పించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. భద్రతను పెంచడానికి, ట్రాఫిక్ రాకపోకలను మెరుగుపరచడానికి, రైల్వేలు లెవెల్ క్రాసింగ్ గేట్లను తొలగించి, భారతీయ రైల్వే వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు/రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లను నిర్మించబడుతున్నాయని ఆయన అన్నారు. ఇది రద్దీని తగ్గించడంలో, రహదారి ట్రాఫిక్ రాకపోకలను మెరుగుపరచడంలో, ప్రయాణికుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు.


