గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహార పంపిణీలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పాత్ర అత్యంత కీలకమని, నూతనంగా ఎంపికైన సిబ్బంది విధుల పట్ల అంకితభావం, నిబద్ధతతో పనిచేయాలని మంత్రి డోలా. బాల వీరాంజనేయస్వామి స్వామి పిలుపునిచ్చారు. ఆదివారం టంగుటూరు మండలం, తూర్పు నాయుడు పాలెం గ్రామంలోని క్యాంపు కార్యాలయంలో కొండేపి నియోజకవర్గానికి సంబంధించి నూతనంగా ఎంపికైన అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లకు మంత్రివర్యులు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి డోలా. బాల వీరాంజనేయస్వామి స్వామి మాట్లాడుతూ… కొండేపి నియోజకవర్గంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొండేపి మరియు టంగుటూరు అని రెండు CDPO కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటి పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని వెల్లడించారు. కొండేపి CDPO పరిధిలోని కొండేపి మండలానికి 3 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు, మర్రిపూడి మండలానికి 1 అంగన్వాడీ టీచర్, 3 హెల్పర్ పోస్టులు, పొన్నలూరు మండలానికి 2 హెల్పర్ పోస్టుల నియామక పత్రాలను అందజేశామన్నారు. అదేవిధంగా టంగుటూరు CDPO పరిధిలోని టంగుటూరు మండలానికి 3 అంగన్వాడీ టీచర్లు, 13 మంది హెల్పర్లు, సింగరాయకొండ మండలానికి 1 అంగన్వాడీ టీచర్, 3 హెల్పర్లు, జరుగుమల్లి మండలానికి 2 అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగ నియామక పత్రాలను ఈ రోజు లబ్ధిదారులకు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
నూతన ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ… “అంగన్వాడీ ఉద్యోగం అనేది కేవలం ఒక జీవనోపాధి మాత్రమే కాదు, అదొక పవిత్రమైన సామాజిక బాధ్యత. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గర్భిణులు, బాలింతలు, చిన్నారుల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. కేంద్రాలకు వచ్చే ప్రతి బిడ్డను మీ సొంత బిడ్డలా చూసుకుంటూ పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలి” అని హితవు పలికారు.
అంగన్వాడీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ… “గతంలో కంటే భిన్నంగా మన ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది. అంగన్వాడీల సేవలను గుర్తించి పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాం. రిటైర్ అయ్యే సమయంలో ఆర్థిక భద్రత కోసం ఇచ్చే ప్రయోజనాలను పెంచడంతో పాటు, నిరంతరం ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. అర్హత ఉన్న హెల్పర్లకు టీచర్లుగా ప్రమోషన్లు పొందే అవకాశాన్ని కల్పించాం. మీ పనులను మరింత సులభతరం చేసేందుకు స్మార్ట్ ఫోన్లను అందించడమే కాకుండా, వివిధ సంక్షేమ పథకాలను కూడా వర్తింపజేస్తున్నాం” అని పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలల స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, నూతనంగా ఎంపికైన టీచర్లు, హెల్పర్లు విధుల్లో ఎలాంటి అలసత్వం వహించకుండా క్రమశిక్షణతో పనిచేసి ప్రభుత్వానికి, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఐసిడిఎస్ అధికారులు, మరియు నూతనంగా ఎంపికైన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

