(హైదరాబాద్) సెప్టెంబర్ 5,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాష్ట్ర ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ మహాసభను విజయవంతం చేయాలని హైదరాబాద్ జిల్లా జేఏసీ కన్వీనర్ కృష్ణ యాదవ్ ఉద్యోగులకుపిలుపునిచ్చారు. ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపడుతున్న ఈపోరాటంలో జిల్లాలోని ఉద్యోగులందరూ ఐక్యంగా కదిలి రావాలని కోరారు. శనివారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలన్నారు. సభ విజయవంతానికి ఉద్యోగులను పెద్ద ఎత్తున సమీకరించే ప్రణాళికలు, క్షేత్రస్థాయి ఏర్పాట్లపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సన్నాహక భేటీలో గాంధీ ఆసుపత్రి టీఎన్జీవో యూనిట్ సెక్రటరీ ప్రసన్నానంద్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పద్మిని ప్రియదర్శిని, నాయకులుసత్యనారాయణ, శ్రవణ్, శ్రీనివాస్, కలీం, సంగీత, అష్రఫ్, రహీమ్, మక్సూద్, గోపాల్, చంద్రశేఖర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
