మన ఆలోచనలను ఆచరణ వైపు మళ్ళించే మార్గనిర్దేశకులు గురువులేనని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం ఒంగోలులోని ప్రభుత్వ ఆసుపత్రి ఆడిటోరియంలో జరిగిన జిల్లాస్థాయి గురుపూజోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పి.విజయ్ కుమార్, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్, డిసిఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డిలతో కలిసి ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి సమగ్ర ఎదుగుదలలో గురువుల పాత్ర ఎంతో గొప్పదన్నారు. తనకు కూడా చదువుకునే రోజులలో విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉండేదని, అయితే దానికంటే ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం ప్రభుత్వ ఉద్యోగం ద్వారా వస్తుందని గురువులు తనకు చెప్పారని కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలోనూ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు. లీప్ యాప్ ద్వారా విద్యార్థుల ప్రతిభను ప్రభుత్వం నిరంతరం గమనిస్తూ ఉందన్నారు. ఆయా విషయాలను పరిగణలోకి తీసుకుని ఉపాధ్యాయులు సైతం బోధనపై మరింత దృష్టి సారించడం వలన ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలలో ప్రకాశం జిల్లా నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. ఇదే స్పూర్తితో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని టీచర్లకు కలెక్టర్ సూచించారు.
ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ సవాళ్లతో కూడిన విద్యా శాఖను తీసుకుని మంత్రి లోకేష్ సమర్థంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చేలా మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, తీసుకువచ్చిన సంస్కరణలే దీనికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల ముందు ‘ నో అడ్మిషన్ ‘ బోర్డులు పెట్టడమే విద్యా శాఖలో సాధించిన పురోగతిని ప్రస్ఫుటం చేస్తున్నట్లు తెలిపారు.
ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ సమాజంలో జీవిత పాఠాలను నేర్పేది గురువులేనని అన్నారు. అందుకే
విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. కాశిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న గురువులు సదాస్మరణీయులని అన్నారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ నిపుణులు, నిధులు పుష్కలంగా ఉండేది ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్నారు. గతానికి భిన్నంగా నేడు ప్రైవేటు స్కూళ్లు కూడా ప్రభుత్వ పాఠశాలలతో పోల్చుకుని పోటీపడే విధంగా ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 16 వేలకు పైగా టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిందని, టీచర్లను బోధనేతర విధుల నుంచీ తప్పించిందని గుర్తు చేశారు.
జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి.సి.వి.రేణుక అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 72 మంది ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టర్, ఎంపీ, ఇతర ప్రముఖులు సన్మానించారు.
ఈ గురుపూజోత్సవంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డిప్యూటీ విద్యాధికారులు రవి, రంగయ్య, సమగ్ర శిక్ష ఏపీసీ అనిల్ కుమార్, డి.సి.ఈ.బి.కార్యదర్శి శ్రీనివాసరావు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.







