వరల్డ్ రికార్డ్స్ లోకి ఒంగోలు……!. తడి, పొడి చెత్తల నిర్వహణలో 80 వేలకుపైగా కుటుంబాల భాగస్వామ్యం…… కమిషనరుకు ప్రశంసాపత్రం అందించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి

అద్భుతం ఆవిష్కృతమైంది. చారిత్రక నగరమైన ఒంగోలు విశిష్టత విశ్వఖ్యాతి గడించింది. వ్యర్ధాల నిర్వహణలో ఒంగోలు ప్రజల ఆసక్తిని చూసి ‘ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( డబ్ల్యూ.బి.ఆర్ ) ‘ సైతం మురిసిపోయింది. ఔను…! శనివారం ఒంగోలు నగరవ్యాప్తంగా మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన తడి చెత్త, పొడి చెత్త ‘ మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ‘ తో ఈ రికార్డు సొంతమైంది. నగర పరిధిలోని 80 వేలకు పైగా కుటుంబాలు ఉత్సాహంగా తమ బాధ్యత నిర్వహించడంతో డబ్ల్యూ.బి.ఆర్. ప్రశంసా పత్రాన్ని అందించింది.
ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా వివిధ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అధికార యంత్రాంగం చేపట్టిన ‘ మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ‘ విజయవంతమైంది. డబ్ల్యూ.బి.ఆర్. జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఉల్లాజీ ఎలియాజర్ ప్రత్యక్ష పరిశీలనలో శనివారం ఉదయం నగరవ్యాప్తంగా మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ మరియు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన రావు, బి.ఎన్.విజయ్ కుమార్ పాల్గొని తడి, పొడి వ్యర్ధాలను చేయటంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించారు. డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ అనుపమ, మెప్మా పీడీ నారాయణ, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్ కూడా నగరంలోని ఐదు శానిటేషన్ డివిజనులకు స్పెషల్ ఆఫీసర్లుగా వ్యవహరించి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. అనంతరం, భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మున్సిపల్ యంత్రాంగాన్ని డబ్ల్యూ.బి.ఆర్. ప్రతినిధి అభినందించారు. కమిషనర్ మెడలో గోల్డ్ మెడల్ వేసి ప్రశంసాపత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రతతోనే గౌరవం వస్తుందన్నారు. ఈ వాస్తవాన్ని ఎరిగి ఒంగోలు ప్రజలు ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల భాగస్వామ్యం, సమన్వయంతో సిబ్బంది విధులు, ప్రజా ప్రతినిధుల సహకారంతోనే ఒంగోలుకు ఈ గుర్తింపు లభించిందన్నారు. వ్యర్థాలను వేరు చేయడంతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దిశా నిర్దేశం మేరకు సర్క్యులర్ ఎకానమీపై దృష్టి సారించినట్లు చెప్పారు. నగర ప్రజలకు ప్రయోజనకరంగా, మున్సిపాలిటీకి ఆదాయం సమకూరేలా మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఒంగోల్…. వన్ గోల్ : ఎంపీ

       ఎంపీ మాట్లాడుతూ తమ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలనే ' వన్ గోల్ ' తో ముందుకు రావడంతో ' ఒంగోల్ ' కు వరల్డ్ రికార్డ్ వచ్చిందన్నారు. భాగస్వాములకు, సమన్వయకర్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 

సమిష్టి కృషితో సత్ఫలితం : ఎమ్మెల్యే

     ప్రజలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా సమన్వయంతో పనిచేయటం ద్వారా ఒంగోలుకు ఈ ఘనత దక్కిందన్నారు. పారిశుద్ధ్యం ఆవశ్యకత, వ్యర్ధాల నిర్వహణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించామన్నారు. ప్రతి ఇంటికీ రెండు చెత్త వేసే డబ్బాలను త్వరలో పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ ' మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ' లో భాగస్వాములైన ప్రజలకు డివిజన్ల వారీగా లక్కీ డ్రా ద్వారా గోల్డ్ కాయిన్ ఇస్తామన్నారు. ఈనెల 28, 29, 30 తేదీలలో జరిగే 150 ఏళ్ల వేడుకలలో ఈ డ్రా తీస్తామని ప్రకటించారు. ఈనెల 30వ తేదీన ఒంగోలు గిత్తల ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. ఒంగోలు నగర సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రెండేళ్లలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. డ్రైనేజీలు, రోడ్ల విస్తరణ - నిర్మాణంపై గత రెండేళ్ల నుంచి దృష్టి సారించామన్నారు. ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. 
      ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ ముప్పవరపు సుచిత్ర, మాజీ మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు గిత్తల ప్రదర్శనకు సంబంధించిన బ్రోచర్ ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *