150 ఏళ్ల చరిత్రకు ఒంగోలు ముస్తాబవుతోంది..!
చరిత్రను గుర్తుచేసుకుంటూ.. ఘన వారసత్వాన్ని చాటుకుంటూ.. ‘మన ఒంగోలు–మన పండుగ’ పేరుతో ఈ నెల 30న భారీ వేడుకలకు నగరం సిద్ధమవుతోంది. ఉత్సవాల్లో నగర ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు పిలుపునిచ్చారు. ఒంగోలు నగర టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో 150 ఏళ్ల ఉత్సవాల వివరాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు వెల్లడించారు. ఇప్పటికే చర్చి సెంటర్‌లో అశోకుని శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడంతో పాటు.. ఒకే రోజు 150 మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేపట్టామని, అలాగే ఒకే గంటలో 80 వేలకు పైగా ఇళ్లను సందర్శించి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి రికార్డు సాధించామని తెలిపారు. మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని తొలుత నిర్ణయించినప్పటికీ.. పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 30న ఒక్కరోజే ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దామచర్ల తెలిపారు.
ఉదయం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ కార్యక్రమాలు, ప్రముఖుల సన్మానాలు ఉంటాయని చెప్పారు. ఇక మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.00 గంటల వరకు మినీ స్టేడియం నుంచి అద్దంకి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వరకు 75 జతల భారీ ఎద్దుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు.
150 ఏళ్ల చరిత్ర అంటే ఒక సువర్ణ అధ్యాయం..! ఒంగోలు పౌరుషానికి, రైతు సంస్కృతికి ప్రతీకగా ఈ ప్రదర్శన నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు , గవర్నర్ కంభంపాటి హరిబాబు , స్పీకర్ అయ్యన్నపాత్రుడు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని వెల్లడించారు.
150 ఏళ్ల చరిత్ర.. ఒక్కరోజు వేడుక కాదు.. ఒంగోలు ప్రతి పౌరుడి గర్వకారణం..!
అందరూ ఈ మహా ఉత్సవాన్ని తమ సొంత పండుగగా భావించి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు కోరారు.
ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగొర్ల వెంకటరావు, నగర టీడీపీ అధ్యక్షులు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు.


