మార్కాపురం సబ్‌డివిజన్ పోలీస్ అధికారి (ఎస్‌డీపీఓ) యు. నాగరాజు పదవీ విరమణ కార్యక్రమం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ,ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరై నాగరాజును సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ.. పోలీసు శాఖలో సుదీర్ఘకాలం విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు నాగరాజు అందించిన సేవలు అభినందనీయమన్నారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసి ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ.. నాగరాజు ఏ పదవిలో, ఎక్కడ పనిచేసినా విధి పట్ల నిబద్ధతతో, నీతి నిజాయితీలతో పనిచేశారని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో విశేష కృషి చేశారని అన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ జిల్లా నాయకుడు ఇమ్మడి కాశీనాథ్, టీడీపీ నియోజకవర్గ పోల్ మేనేజ్‌మెంట్ క్లస్టర్ ఇన్‌చార్జి కందుల రామిరెడ్డి, మార్కాపురం మార్కెట్ యార్డు చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారావు, బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
