అర్నబ్ తీవ్ర తుఫాన్ దృష్ట్యా తీర ప్రాంతంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

అర్నబ్ తీవ్ర తుఫాన్ దృష్ట్యా తీర ప్రాంతంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజుతో కలిసి నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామంలో ఆయన పర్యటించారు. సముద్ర తీరాన్ని వారు పరిశీలించారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తుఫాన్ షెల్టర్ కేంద్రాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులను ఉద్దేశించి కలెక్టర్ .పి.రాజాబాబు మాట్లాడుతూ తుఫాన్ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సముద్రం వద్దకు వెళ్ళవద్దని సూచించారు. తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలు కూడా ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ తుఫాన్ తీవ్రతపై డప్పు చాటింపు ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేలా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా జనరేటర్లు, ట్రాక్టర్లు, పొక్లెయిన్లు, మిషన్ రంపాలు, పెట్రోల్ బంకులలో పూర్తిస్థాయిలో ఇంధనాన్ని అందుబాటులో పెట్టుకోవాలన్నారు. పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉండాలని, వృద్ధులు, బాలింతలు, గర్భిణులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తుఫాన్ షెల్టర్ లో అవసరమైన మందులను అందుబాటులో పెట్టుకోవాలని చెప్పారు. ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్నా కలెక్టర్ కార్యాలయంతోపాటు తహసిల్దార్ కార్యాలయంలోనూ కాల్ సెంటర్ ఏర్పాటు చేసామన్నారు. ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ తీర ప్రాంతంలో గస్తీని
పెంచామన్నారు. తుఫాన్ దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక కమ్యూనికేషన్ సెట్ కూడా అందుబాటులో ఉంచామన్నారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డిపిఓ అనుపమ, ఏపీ సిపిడిసిఎల్ ఎస్.ఈ. వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్, మండల స్థాయి అధికారులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *