హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటగిరి వాటర్ ట్యాంక్ సమీపంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. మంగళవారం (అక్టోబర్ 27, 2026) రాత్రి 10:41 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నేపాల్‌కు చెందిన రాము (25), డానిష్ (32), విశాల్ (25) ముగ్గురూ స్నేహితులని, సినిమా పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారని సమాచారం. ఘటన జరిగిన సమయంలో ముగ్గురూ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో రాము, డానిష్‌లు కలిసి విశాల్‌పై కత్తితో దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఈ దాడిలో విశాల్ కడుపు, ఛాతీ, వీపు భాగాల్లో కత్తిపోట్లు తగిలాయి. తీవ్రంగా గాయపడిన విశాల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులుగా భావిస్తున్న రాము, డానిష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఈ కత్తిపోట్ల ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: