‘మీ సురక్ష 2.0’తో నివాస ప్రాంతాల్లో పటిష్ట భద్రత -గృహ సహాయకుల వివరాలు నమోదు చేసుకోవాలి… మల్కాజ్గిరి సీపీ బి. సుమతి.

బేగంపేట అక్టోబర్ 28 (జేఎస్ డీఎం న్యూస్)
ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు నివాస ప్రాంతాల్లో నేరాల నియంత్రణే ధ్యేయంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘మీ సురక్ష 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పోలీస్ కమిషనర్ బి. సుమతి వెల్లడించారు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మయూర్ మార్గ్‌లో గల మయూర్ అపార్ట్‌మెంట్స్‌లో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ఈ నూతన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ సుమతి మాట్లాడుతూ, ఇళ్లలో పనిచేసే పనిమనుషులు, వంటవారు, ధోబీలు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, వాచ్‌మెన్లు తదితర గృహ సహాయకుల వివరాలను పోలీసుల వద్ద నమోదు చేయించడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం బాధ్యతాయుతంగా వ్యవహరించి తమ వద్ద పనిచేస్తున్న వారి వ్యక్తిగత సమాచారం, గుర్తింపు వివరాలను మల్కాజిగిరి పోలీస్ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘మీ సురక్ష’ అప్లికేషన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. సహాయకుల వివరాలను ధ్రువీకరించుకోవడం వల్ల చోరీలు, ఇతర ఆస్తి సంబంధిత నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని, అనుమానాస్పద కదలికలను ముందే గుర్తించే అవకాశం లభిస్తుందని వివరించారు.
ప్రజల సహకారం, సమన్వయంతోనే సమాజంలో శాంతిభద్రతలను పటిష్టంగా కాపాడగలమని, ప్రతి అపార్ట్‌మెంట్, కాలనీ సంక్షేమ సంఘాలు ఈ నమోదు ప్రక్రియలో చురుగ్గా భాగస్వాములు కావాలని సీపీ పిలుపునిచ్చారు. ఈ సదస్సులో మయూర్ అపార్ట్‌మెంట్స్, మయూర్ మార్గ్ నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొని భద్రతా నియమాలపై అవగాహన పొందారు. కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ చి. శ్రీధర్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి, ఎస్‌బీ డీసీపీ నరసింహారెడ్డి, బేగంపేట ఏసీపీ పి. గోపాలకృష్ణమూర్తి, బేగంపేట ఇన్‌స్పెక్టర్ పి. సైదులు సహా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *