మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు

మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసామని జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు తెలిపారు. జిల్లాలవారీగా పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అబ్జర్వర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి జిల్లా ఎన్నికల పరిశీలకులు కె.హెప్సిబా రాణి, వ్యయ పరిశీలకులు వివేక్ , ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారిలతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పరిస్థితిని వివరించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చి సకాలంలో వారు డిస్ట్రిబ్యూషన్ సెంటరుకు చేరుకునేలా ఏర్పాట్లు చేసామన్నారు. పోలింగ్ అనంతరం స్ట్రాంగ్ రూములకు భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్ లను తరలించేలా రవాణా ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు. ఒంగోలు కార్పొరేషన్ తో పాటు చీమకుర్తి, అద్దంకి మున్సిపాలిటీలకు ఒంగోలు శివారులోని ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ సెంటర్ కేటాయించామన్నారు. మున్సిపల్ ఎన్నికలు, కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసామన్నారు.
ఎస్పీ మాట్లాడుతూ అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక, సాధారణ కేటగిరీలుగా పోలింగ్ కేంద్రాలను విభజించి, స్థానిక పరిస్థితులను బట్టి అవసరమైన పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నట్లు చెప్పారు. డ్రోన్లు, బాడీ వేర్ కెమెరాలతో పటిష్ట నిఘా పెడుతున్నట్లు తెలిపారు.
పరిశీలకురాలు మాట్లాడుతూ వచ్చే రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉంటామన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా, పారదర్శకంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ముగిసేలా చూస్తామన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసినందున బార్లు, మద్యం దుకాణాలను కూడా మూసి వేయించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం, అర్బన్ ఎలక్షన్స్ నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈవో చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *