ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి – పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్: జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు

నవంబర్ 1వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి శుక్రవారం ప్రకాశం భవనంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పోలింగ్, బందోబస్తు మరియు పర్యవేక్షణకు సంబంధించి తమ శాఖల ద్వారా చేపట్టిన పూర్తి స్థాయి చర్యలను కలెక్టర్ మరియు ఎస్పీ విడివిడిగా వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

​ జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడిన వివరాలు:

​జిల్లా కలెక్టర్   పి. రాజాబాబు మాట్లాడుతూ జిల్లాలో  నవంబర్ 1వ తేదీన చీమకుర్తి, అద్దంకి మున్సిపాలిటీలకు, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ మూడు అర్బన్ ప్రాంతాల పరిధిలో మొత్తంగా 303 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, వీటన్నింటికీ సంబంధించి పోలింగ్ ఏర్పాట్లన్నీ పూర్తిగా పూర్తయ్యాయని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ కోసం ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర పోలింగ్ ఆఫీసర్లు మరియు మైక్రో ఆఫీసర్లు (అబ్జర్వర్లు) అందరూ కలిపి మొత్తం 2,284 మంది సిబ్బందిని ఎంపిక చేసి, వారికి ఇప్పటికే పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. 

ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగేందుకు నిబంధనల ప్రకారం సిబ్బందికి (3 సార్లు) రాండమైజేషన్ పూర్తి చేశామని, డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు వచ్చే వరకు ఏ అధికారి ఏ పోలింగ్ స్టేషన్‌కు వెళ్తారనేది ఎవరికీ తెలియదని వివరించారు.
​బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియ అంతా పూర్తయ్యి, బ్యాలెట్ మెటీరియల్ అంతా అత్యంత భద్రంగా స్ట్రాంగ్ రూమ్‌లో ఉంచామని, శనివారం ఉదయమే పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) జరుగుతుందని చెప్పారు. సామగ్రి పంపిణీ కోసం చీమకుర్తి మరియు అద్దంకిలలో ఆయా మున్సిపల్ ఏరియాలలోనే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి రైస్ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పెట్టామని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత రెండు మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్‌కు చెందిన బ్యాలెట్ బాక్సులు, మెటీరియల్ మొత్తాన్ని స్వీకరించే రిసెప్షన్ సెంటర్‌ను, అలాగే అన్ని ప్రాంతాల ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ప్రక్రియను ఒంగోలులోని రైస్ కాలేజీలోనే ఒకే చోట ఏర్పాటు చేశామని వెల్లడించారు.

       ​ఎలక్షన్ రూల్స్ ప్రకారం పోలింగ్ ప్రారంభానికి 48 గంటల ముందు, అనగా శుక్రవారం సాయంత్రం 5:00 గంటల నుంచే ప్రచారం పూర్తిగా నిలిచిపోయిందని, ఇకపై ఎవరు కూడా క్యాంపెయిన్ చేయకూడదని హెచ్చరించారు. జిల్లాలోని చిన్న షాపులు, బార్లు సహా అన్ని రకాల లిక్కర్ షాపులను పూర్తిగా బంద్ చేసేలా ఉత్తర్వులు ఇచ్చామన్నారు. నవంబర్ 1వ తేదీ ఆదివారం రెగ్యులర్ హాలిడే అయినప్పటికీ, కార్మికులు మరియు ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన లేబర్ హాలిడే కూడా అధికారికంగా డిక్లేర్ చేశామని చెప్పారు. ఓటర్ స్లిప్పులను  వార్డుల్లో ఉన్న ఓటర్లందరికీ దాదాపుగా పంపిణీ పూర్తి చేశామని ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నారు.

​ఓటర్ గుర్తింపు కోసం ఓటర్ ఐడీ కార్డుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 21 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపి ఓటు వేయడానికి వెళ్లవచ్చని స్పష్టం చేశారు. వీటిలో ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడీ, ఫోటోతో కూడిన పెన్షన్ పత్రాలు, ఫోటోతో కూడిన ఆస్తి పత్రాలు, ఫోటోతో కూడిన బ్యాంక్ పాస్‌బుక్, ఫోటోతో కూడిన ఏటీఎం కార్డు, రేషన్ కార్డులు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) స్మార్ట్ కార్డులు, ఉపాధి హామీ (MGNREGA) జాబ్ కార్డు, ఎస్సీ/ఎస్టీ/బీసీ ధృవీకరణ పత్రాలు, స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డులు, ఫోటోతో కూడిన ఆయుధాల లైసెన్స్, ఫోటోతో కూడిన వికలాంగుల ధృవీకరణ పత్రం, బార్ కౌన్సిల్ సభ్యత్వ కార్డు, ఆరోగ్య బీమా పథకం స్మార్ట్ కార్డులు, ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీల గుర్తింపు కార్డులు, లోక్‌సభ/రాజ్యసభకు సంబంధించిన గుర్తింపు కార్డులు ఆమోదించబడతాయని వివరించారు.
​ ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి జిల్లాలోని ప్రతి పోలింగ్ స్టేషన్‌లోనూ సీసీ కెమెరాల ద్వారా ఆన్‌లైన్ వెబ్ కాస్టింగ్ జరుగుతుందని, సమస్యాత్మక/హైపర్ సెన్సిటివ్ కేంద్రాల వెలుపల కూడా లైవ్ స్ట్రీమింగ్ వీడియో ఫెసిలిటీ ఏర్పాటు చేశామని, ఈ లైవ్ ఫీడ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌తో పాటు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధికారికి కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. పోలింగ్ ఏజెంట్లు వన్ ప్లస్ టూ (1+2) పద్ధతిలో నియమించబడవచ్చు కానీ, లోపల మాత్రం ఎప్పుడూ ఒక పర్సన్ మాత్రమే ఉండటానికి అవకాశముందన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి మెటీరియల్ తీసుకుని డెడికేటెడ్ రూట్లలో వెళ్లే వాహనాల్లో పోలీసు బందోబస్తుతో సిబ్బందిని డెసిగ్నేటెడ్ పోలింగ్ స్టేషన్లలో డ్రాప్ చేస్తారని చెప్పారు.
​పోలింగ్ ఉదయం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి, పోటీ చేస్తున్న అభ్యర్థుల ఏజెంట్లు అందరూ ఉదయం 6:00 గంటలకల్లా ఆయా పోలింగ్ స్టేషన్ల వద్దకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఏజెంట్లు మెటీరియల్ వెహికల్స్‌ను అనుసరిస్తూ రిసెప్షన్ సెంటర్ దాకా రావచ్చునని, బ్యాలెట్ బాక్సులపై తమ సొంత సీల్ కూడా వేసుకోవచ్చని, స్ట్రాంగ్ రూమ్‌లో పెట్టి లాక్ అండ్ కీ వేసేంత వరకు స్వయంగా ఉండి చూసుకోవచ్చని తెలిపారు.

​ పోలింగ్ స్టేషన్ లోపలికి ప్రవేశించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కేవలం ఏడు రకాల వ్యక్తులకు మాత్రమే అనుమతి ఇచ్చిందని కలెక్టర్ స్పష్టం చేశారు. వారు: 1. పోలింగ్ ఆఫీసర్లు, 2. పోటీ అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు, 3. ఎన్నికల సంఘం ఆథరైజ్ చేసిన వ్యక్తులు/అబ్జర్వర్లు, 4. విధుల్లో ఉన్న పబ్లిక్ సర్వెంట్లు, 5. ఓటర్లతో వచ్చే చంటి పిల్లలు, 6. అంధులు లేదా నడవలేని దివ్యాంగులకు సహాయంగా వచ్చే ఒక వ్యక్తి, 7. ఓటు హక్కు కలిగిన ఓటర్లు. ఓటు వేయడానికి వచ్చే ప్రజాప్రతినిధులు లేదా రాజకీయ నాయకులు ఎలాంటి పార్టీ గుర్తులు, కండువాలు ధరించి లోపలికి రాకూడదని, అలాగే వారి బాడీగార్డులు లేదా సెక్యూరిటీ గార్డులను లోపలికి అనుమతించబోమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమైనదని, అందరూ పద్ధతిగా, ప్రశాంతంగా తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలకు ప్రేరేపిస్తే వారిపై చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.

​

​ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, నవంబర్ 1న జరుగుతున్న అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికల కోసం పోలీసు శాఖ తరఫున సరిపడా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలోని మొత్తం 303 పోలింగ్ స్టేషన్లలో 100 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా (హైపర్ సెన్సిటివ్), 107 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా (సెన్సిటివ్) గుర్తించి కేటగరైజ్ చేశామని, ఈ కేటగిరీల ప్రకారం నిర్ణయించిన స్కేల్ ఆధారంగా అన్ని చోట్లా సఫిషియంట్‌గా బందోబస్తు కేటాయించామని వెల్లడించారు.
​రవాణా మరియు భద్రత కోసం రూట్ మొబైల్స్‌ను సిద్ధం చేశామని, ఒంగోలులో 22, చీమకుర్తిలో 5, అద్దంకిలో 6 రూట్ మొబైల్స్ పనిచేస్తాయని చెప్పారు. మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుండి పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని చేర్చడం, పోలింగ్ ముగిసిన తర్వాత సురక్షితంగా రిసెప్షన్ సెంటర్‌కు తీసుకురావడం ఈ రూట్ మొబైల్స్ బాధ్యత అని, ప్రతి రూట్ మొబైల్‌కు ఒక ఎస్సై (SI) స్థాయి అధికారితో బందోబస్తు ఇచ్చామని తెలిపారు. ఒంగోలులో 7, అద్దంకిలో 2, చీమకుర్తిలో 2 చొప్పున ఇన్సిపెక్టర్ల నేతృత్వంలో స్ట్రైకింగ్ ఫోర్సులను, అలాగే డిఎస్పీల నేతృత్వంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులను (ఒంగోలు-2, అద్దంకి-1, చేమకుర్తి-2) ఏర్పాటు చేశామన్నారు. ఒంగోలు మరియు అద్దంకిలలో అదనపు ఎస్పీ (Additional SP) స్థాయి అధికారులను పర్యవేక్షణకు ఉంచామని వివరించారు.
​పోలింగ్ రోజున పోలింగ్ సెంటర్ పరిధిలోని 100 మీటర్ల పరిధిలో బ్యారికేడింగ్ చేసి వైట్ లైన్ వేస్తామని, ఓటు వేసే ఓటర్లు తప్ప ఇతరులు 100 మీటర్ల పరిధి దాటి లోపలికి రాకూడదని ఎస్పీ స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు 144 సెక్షన్ (163 BNS) అమలులో ఉంటుందని, ఎక్కడా ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడటానికి వీల్లేదని తెలిపారు. 100 మీటర్ల వద్ద ఉన్న పొలిటికల్ పార్టీల క్యాంపుల వద్ద కూడా అనవసరంగా జనం గుమిగూడకుండా కేవలం ఓటర్ స్లిప్పులు ఇచ్చి పంపించేలా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందన్నారు. 100 మీటర్ల సరిహద్దు వద్ద పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్స్ (మైకులు) ద్వారా మైక్ అనౌన్స్‌మెంట్లు ఇస్తామని చెప్పారు.
​పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కెమెరాలతో పాటు, పోలీసు సైడ్ నుంచి అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో పోలింగ్ కేంద్రం వెలుపల కూడా ప్రత్యేక సీసీటీవీ కెమెరాలు అమర్చామని ఎస్పీ వెల్లడించారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి బాడీ వేర్ కెమెరాలు ఇవ్వడంతో పాటు ప్రత్యేక వీడియోగ్రఫీ టీమ్‌ల ద్వారా ప్రతి అంశాన్ని రికార్డ్ చేస్తున్నామని తెలిపారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినా, ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించినా పక్షపాతం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది ఎవరూ పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్లకూడదని, ప్రిసైడింగ్ ఆఫీసర్ రిక్వెస్ట్ చేస్తేనే లోపలికి వెళ్లాలని అంతర్గత ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.

        ​నవంబర్ 3వ తేదీన రైజ్ కాలేజీలో జరిగే ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) కోసం బలమైన మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లు, పోలింగ్ స్టాఫ్ అందరూ అధికారుల జారీ చేసిన పాసులతోనే రావలసి ఉంటుందన్నారు. ట్రాఫిక్, పార్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికీ అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత విజయం సాధించిన అభ్యర్థులు క్రాకర్స్ (బాణసంచా) కాల్చడం గానీ, విజయోత్సవ ర్యాలీలు మరియు ప్రాసెషన్లు నిర్వహించడం గానీ పూర్తిగా నిషేధించబడిందని ఎస్పీ స్పష్టం చేశారు. గౌరవ కలెక్టర్ గారు నిర్ణయించిన తేదీ మరియు ముందస్తు అనుమతి తర్వాత మాత్రమే నిబంధనల ప్రకారం ర్యాలీలు నిర్వహించుకోవచ్చని చెప్పారు.

​పత్రికా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎస్పీ సమాధానమిస్తూ, పోలింగ్ విధులకు పోలీసు శాఖ నుండి మొత్తం 973 మంది పోలీసు సిబ్బందిని డిప్లాయ్ చేస్తున్నామని తెలిపారు. ఇక స్వాధీనాలు (Seizures) మరియు కేసుల విషయానికి వస్తే, గత రెండు వారాలుగా నిర్వహించిన తనిఖీలలో ఎక్సైజ్ మరియు లిక్కర్ నిబంధనల ఉల్లంఘనలపై 43 కేసులు నమోదు చేశామని, నామినేషన్ల సమయంలో జరిగిన ఘర్షణలు మరియు వైయోలేషన్లపై 30 కేసులు నమోదు చేశామని, మొత్తంగా ఇప్పటివరకు 73 కేసులు రిజిస్టర్ చేశామని వెల్లడించారు. రాబోయే రెండు రోజుల్లో కూడా అప్రమత్తంగా ఉండి నగదు పంపిణీ (Cash flow) వంటి చట్టవిరుద్ధ చర్యలపై సమాచారం వస్తే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *