సుదీర్ఘకాలంగా జిల్లా పోలీసు శాఖలో అంచెలు అంచెలుగా వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తూ ఏఆర్ అడిషనల్ ఎస్పీ G. నాగేశ్వర రావు ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో, జిల్లా ఎస్పీ గారు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలతో సత్కరించి, జ్ఞాపికలను బహుకరిస్తూ ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ సుదీర్ఘంగా 35 సంవత్సరాల 3 నెలలు పాటు పోలీసు శాఖలో విధులు నిర్వహించినట్టు తెలిపారు. పోలీసు ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉన్నా, వ్యక్తిత్వానికి మాత్రం రిటైర్మెంట్ ఉండదన్నారు. పోలీసు ఉద్యోగం అనేది ప్రజలతో నిత్యం మమేకమయ్యే, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే బాధ్యతాయుతమైన ఉద్యోగమన్నారు. VVIP సెక్యూరిటీ వింగ్, ఏఆర్ విభాగాలకు సంబంధించిన విధులతో పాటు, వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన బందోబస్తు విధుల్లోనూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని ప్రశంసించారు.
సుదీర్ఘకాలం విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు, కఠిన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయడం మరియు వారి పిల్లలను కూడా ఉన్నతంగా తీర్చిదిద్దడంలోను ఎనలేని కృషి చేసారని అభినందించారు. ఆరోగ్యవంతంగా ఉద్యోగ విరమణ పొందడం సంతోషంగా ఉందన్నారు. నచ్చిన వ్యాపకంతో శేష జీవితం గడపాలని సూచించారు. పోలీసు ఉద్యోగంలో సేవలందించేందుకు సహాయ, సహకారాలు అందించిన కుటుంబ సభ్యులకు జిల్లా పోలీసు శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు.
రిటైర్మెంట్ అనేది ఒక కొత్త జీవన అధ్యాయం మొదలుకావడమే కాని, ముగింపు కాదని చెప్పారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ అనంతరం ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని, పోలీసు శాఖ ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్లలో 2014లో రాంచీ (జార్ఖండ్)లో వెండి పతకం, 2017లో చండీగఢ్‌లో బంగారు, వెండి పతకాలు సాధించారు. తన క్రీడా జీవితంలో మొత్తంగా 1 బంగారు, 3 వెండి పతకాలు గెలుచుకున్నారు.
రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్‌గా 1991వ సంవత్సరం పోలీసు శాఖలో ప్రవేశించారు. అనంతరం 2000వ సంవత్సరంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్‌గా ప్రమోషన్ పొందారు. ఆ తరువాత 2010వ సంవత్సరంలో డి.ఎస్.పీ.గా, 2022వ సంవత్సరంలో అదనపు ఎస్.పీ.గా ప్రమోషన్ పొంది, సుదీర్ఘమైన 35 సంవత్సరాలు పోలీసు శాఖలో సేవలందించారు. 2017లో మహోన్నత ఆంధ్రప్రదేశ్ పోలీసు సేవా పతకం, 2023లో ఉత్తమ సేవా పతకంతో పాటు 2 MSE పతకాలు, 123 నగదు రివార్డులు, 6 ప్రశంసా పత్రాలు, 3 కమండేషన్లు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యన్.యుగంధర్ బాబు, అడిషనల్ ఎస్పీ (క్రైమ్)వెంకటేశ్వర్లు, కందుకూరు డిఎస్పీ బాలసుబ్రమణ్యం, డీటీసీ డిఎస్పీ గురునాథ రావు, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి పి శ్రీధర్,ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఒంగోలు టౌన్ సిఐలు వెంకటేశ్వరరావు, వీరనాయక్, విజయకృష్ణ, RIలు రమణ రెడ్డి, సీతారామి రెడ్డి, అధికారులు, ఎఆర్ఎస్సై లు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: