హైదరాబాద్ అక్టోబర్ 30(జే ఎస్ డీ ఎం న్యూస్ ):
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో భారీగా విగ్రహాల నిమజ్జనం జరిగింది. దీంతో నీటి నాణ్యత గణనీయంగా క్షీణించినట్లు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) వెల్లడించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిబంధనల ప్రకారం నిమజ్జనానికి ముందు, నిమజ్జనం సమయంలో, పూర్తయిన తర్వాత మూడు దశల్లో సాగర్‌లోని ఆరు ప్రధాన ప్రాంతాల నుంచి సేకరించిన నీటి నమూనాల పరీక్షల్లో కీలక విషయాలు వెలుగుచూశాయి.
సెప్టెంబర్ 14న జరిగిన వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని నిమజ్జనానికి ముందు సెప్టెంబర్ 11న, నిమజ్జనాల సందర్భంగా సెప్టెంబర్ 17, 19, 21, 23 తేదీల్లో, ప్రక్రియ పూర్తయ్యాక సెప్టెంబర్ 28న అధికారులు నీటి నమూనాలను సేకరించారు. ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న ప్లాట్‌ఫాం నంబర్ 1, ప్లాట్‌ఫాం నంబర్ 2, లుంబినీ పార్క్, నెక్లెస్ రోడ్, నిమజ్జన ప్రాంతం సమీపంలోని లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్, బుద్ధ విగ్రహం పరిసరాల్లోని కంట్రోల్ పాయింట్ వద్ద సమగ్ర పరీక్షలు నిర్వహించారు.
ఈ అధ్యయనంలో నిమజ్జనం సమయంలో నీటి మసకదనం (టర్బిడిటి), తేలియాడే ఘన పదార్థాలు (టీఎస్ఎస్), రసాయనిక ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ), జీవరసాయనిక ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) స్థాయులు భారీగా పెరిగినట్లు స్పష్టమైంది. ముఖ్యంగా నెక్లెస్ రోడ్ పరిసరాల్లో అత్యధికంగా 200 ఎన్టీయూ టర్బిడిటి, లీటరుకు 164 మిల్లీగ్రాముల సీఓడీ నమోదైంది. ప్లాట్‌ఫాం నంబర్ 1 వద్ద అత్యధికంగా లీటరుకు 99 మిల్లీగ్రాముల టీఎస్ఎస్ రికార్డయింది. నిమజ్జనం ముగిసిన తర్వాత వీటి తీవ్రత కాస్త తగ్గినప్పటికీ, ఉత్సవాలకు ముందు ఉన్న సాధారణ స్థితికి మాత్రం చేరుకోలేదని నివేదిక పేర్కొంది.
బ్యాక్టీరియా తీవ్రతను పరిశీలిస్తే, అన్ని ప్రాంతాల్లోనూ మొత్తం కోలిఫామ్ బ్యాక్టీరియా గణనీయంగా పెరిగింది. ప్లాట్‌ఫాం నంబర్ 1, 2, నెక్లెస్ రోడ్, బుద్ధ విగ్రహం వద్ద ఫీకల్ కోలిఫామ్ తీవ్రత అధికంగా కనిపించింది. లుంబినీ పార్క్ వద్ద నిమజ్జనం తర్వాతి రోజుల్లో ఫీకల్ కోలిఫామ్ మరింత పెరిగినట్లు తేలింది. అయితే నీటిలో కరిగిన ఆక్సిజన్ (డీఓ) స్థాయుల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు. మరోవైపు సెప్టెంబర్ మధ్యలో కురిసిన వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి మురుగు, వర్షపు నీరు సాగర్‌లోకి చేరడం కూడా సీఓడీ, బీఓడీ, నీటి కాఠిన్యం పెరగడానికి కారణమైందని విశ్లేషించారు. చారిత్రక హుస్సేన్‌సాగర్ పరిరక్షణకు ప్రజలు, సంబంధిత ప్రభుత్వ విభాగాలు, ఉత్సవ కమిటీలు పూర్తి సహకారం అందించాలని కాలుష్య నియంత్రణ మండలి కోరింది.

Save or share this story as a newspaper-style Epaper Clip: