లైసెన్సులు లేకుండా టపాసులు విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు – ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు

దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బాణసంచా విక్రయదారులు పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలు పాటించాలని, అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా విక్రయాలు, నిల్వలు చేపట్టే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లాలో బాణసంచా తయారీ, నిల్వ,విక్రయాలు నిర్వహించే వ్యాపారులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి లైసెన్సులు పొందాలని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఇళ్లలో బాణసంచా, పేలుడు పదార్థాలను నిల్వ ఉంచడం నిషేధమని, అనుమతి పొందిన శాశ్వత లేదా తాత్కాలిక దుకాణాల్లో మాత్రమే విక్రయాలు జరపాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో నిర్ణీత భద్రతా ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లలోనే వ్యాపారాలు నిర్వహించాలన్నారు.

బాణసంచా దుకాణాల పరిసరాల్లో మండే స్వభావం కలిగిన వస్తువులను ఉంచకూడదని, ప్రమాదాల నివారణకు నీరు, ఇసుక, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. దుకాణాల వద్ద పాటించాల్సిన భద్రతా నియమాలు, చేయకూడని పనులకు సంబంధించిన సూచనల బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.చిన్న పిల్లలను బాణసంచా దుకాణాల్లో విక్రయాల కోసం ఉంచరాదని, లైసెన్సు కల్గిన దుకాణదారులు మాత్రమే బాణసంచా విక్రయాలు నిర్వహించాలన్నారు.

అలాగే బాణసంచా దుకాణాల సమీపంలో వాహనాల పార్కింగ్‌కు అనుమతించకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వ్యాపారులకు సూచించారు.

జిల్లాలో అక్రమంగా టపాసులు తయారు చేసే వారు, సరఫరా మరియు విక్రయాలు చేసే వారిపై నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులకు ఆదేశించారు. టపాసుల స్టాల్స్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ చర్యలు సమర్థంగా అమలు చేయాలని, నిరంతర తనిఖీలు నిర్వహించి మతాబుల దుకాణాల వద్ద భద్రతా చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రమాదాలను నివారించగలమన్నారు.

జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా బాణసంచా నిల్వలు లేదా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలిపారు.

దీపావళి పర్వదినాన్ని జిల్లా ప్రజలు ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. సాధ్యమైనంతవరకు కాలుష్యరహిత టపాసులను మాత్రమే ఉపయోగించాలని, టపాసులు కాల్చేటప్పుడు కాటన్‌ దుస్తులు ధరించాలి, సిల్క్‌ లేదా సింథటిక్‌ వస్త్రాలు ధరించరాదని తెలిపారు. అలాగే టపాసులు కాల్చే సమయంలో ప్రజలకు లేదా రహదారులపై వెళ్లే వాహనాలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఎస్పీ సూచించారు.

దీపావళి సందర్భంగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే ఫైర్‌స్టేషన్‌ నంబర్‌ 101కి, పోలీస్‌ డయల్‌ 100/112లకు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *