జిల్లా వ్యాప్తంగా రేపు శనివారం జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ నేపథ్యంలో ఒంగోలులోని రైజ్ (RISE) కాలేజీ, క్విజ్ (QIS) కాలేజీలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ గారు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఒంగోలులోని క్విజ్ కాలేజీలో 12 మండలాలకు, ఒంగోలు సమీపంలోని రైజ్ కాలేజీలో 13 మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎన్నికల అధికారులు అనుమతించిన సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లను మాత్రమే నిబంధనల ప్రకారం గుర్తింపు కార్డులు, అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అనుమతించాలని, కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని సూచించారు. ఆయా మండలాలకు సంబంధించిన అధికారులు, అభ్యర్థులు, ఏజెంట్లను వారికి కేటాయించిన కౌంటింగ్ కేంద్రాలు, ప్రదేశాలకు మాత్రమే పంపించాలని తెలిపారు. అభ్యర్థులు, ఏజెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సైన్ బోర్డుల ద్వారా మార్గాలను సూచించాలని ఆదేశించారు.
కౌంటింగ్ కేంద్రాల భవనాలు, స్ట్రాంగ్ రూమ్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పరిసర ప్రాంతాల్లో భద్రతా లోపాలు లేకుండా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని, సీసీటీవీ కెమెరాల పనితీరును పరిశీలించి నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిసరాలను పరిశీలించాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వెలుపల ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా, వాహనాలను కేటాయించిన ప్రదేశాల్లోనే నిలిపేలా చర్యలు తీసుకోవాలని, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, బెల్ హ్యాండ్స్ ద్వారా అక్కడికి వచ్చే వాహనదారులకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు అందిస్తూ, ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం, ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ మొబైల్ బృందాలతో నిరంతర గస్తీ నిర్వహించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. కౌంటింగ్ అనంతరం గెలుపొందిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, డప్పు వాయిద్యాలతో ప్రదర్శనలు, బాణసంచా కాల్చడం, ప్రత్యర్థులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, గుంపులుగా చేరి ఘర్షణలకు పాల్పడటం వంటి చర్యలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 163 BNSS సెక్షన్ మరియు పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉన్నాయని ఎవరు గుమ్మి కూడ కూడదని తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలన్నారు.
కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, బందోబస్తు ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
రైజ్ కాలేజీ కౌంటింగ్ కేంద్రానికి అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్. యుగంధర్ బాబు, క్విజ్ కాలేజీకి అడిషనల్ ఎస్పీ (క్రైమ్) సి.హెచ్. వెంకటేశ్వర్లు ఇన్చార్జులుగా ఉన్నారు. రైజ్ కాలేజీ వద్ద 404 మంది, క్విజ్ కాలేజీ వద్ద 454 మంది పోలీస్ సిబ్బందితో పాటు 119 మంది రిజర్వ్ ఫోర్స్ సిబ్బందిని బందోబస్తు విధులకు కేటాయించారు. మొత్తం ఆరుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, 900 మంది పోలీస్ సిబ్బందితో పాటు ఏపీఎస్పీ సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఎన్. యుగంధర్ బాబు, సి.హెచ్. వెంకటేశ్వర్లు, ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, కందుకూరు డీఎస్పీ బాలసుబ్రమణ్యం, డీటీసీ డీఎస్పీ గురునాథరావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ పి. శ్రీధర్, ఏఆర్ డీఎస్పీ కె. శ్రీనివాసరావు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: