ప్రభుత్వ పథకాలు నోచుకోలేక సంచార నక్కల సామాజిక వర్గం- ఓటు హక్కు ఉన్నా పక్కా గృహాలు లేవు. -ఆధార్ ఉన్నా ప్రభుత్వ ఆదరణ లేదు -చిత్తశుద్ధితో వారి జీవన ప్రమాణాలు మెరగు పరచాలి.-ధనిశెట్టి రామునాయుడు

నక్కల వారి జీవితాలు రోడ్దు పక్క కాలువలకే పరిమితమా!! అవుననే అనిపిస్తుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా చేయవలసిన ముఖ్యమైన పని మానవ జీవితాల జీవనప్రమాణాలను అభివృద్ధి చెందించడమే… ఆహారము, ఆరోగ్యము, కుటీరము, విద్య తద్వారా ఉపాధి కల్పనలను ఏర్పరచాలి. కానీ ప్రస్తుత సమకాలిన కాలంలో అట్టడుగు వర్గాలు అట్టడుగునే మిగిలిపోతున్నారు. కూడు, గుడ్డ, నీడ సరి అయినవి లేక వారి జీవితాలు అధఃపాతాళంలో కూరుకుపోతున్నాయి. మధ్యతరగతి వారు అనేక ఆటుపోట్లను భరిస్తూ తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. ఉన్నత వర్గాలు సిరిసంపదలు కలిగి సమాజంలో ఉన్నటువంటి సంపద 60 శాతం పైగా వారి దగ్గరే కూడి ఉంటున్నది. ఆ ధనవంతులు ఏ ఏటికి ఆ ఏడు మరింత ఉన్నతి స్థితికి చేరుతున్నారు. వీరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు ఎన్నో అద్భుతమైన పథకాలను రూపొందించి వారి అమలకు కృషి చేస్తున్నాయి. ఆ పథకాల ఫలాలు దేశంలోని అట్టడుగు వర్గానికి సైతం చేరాలి, వారు ఉన్నతంగా ఎదగాలి కానీ పథకాల రూపకల్పనలో ఉన్నటువంటి విధివిధానాలు ఆ పథకం అమలుకు ఆటంకాలు అవుతున్నాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నాయి.

మహిళల ఆరోగ్యమును దృష్టిలో ఉంచుకొని సాంప్రదాయ వనరులచే ఆహారము వండుకునే విధానాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఈమధ్య ప్రారంభించినటువంటి ప్రధాని ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలకు ఉచితముగా గ్యాస్ కనెక్షన్లను చేర్చాలన్న వారి ఆలోచన ఆ పథకం అమలులో ఉన్నటువంటి రూల్స్ పేదవారికి ఆ పథకం చేరడంలో అవాంతరాలు లేక అడ్డంకులు ఏర్పరుస్తున్నాయి.

ముఖ్యంగా ఒంగోలు నగరంలోని ఆర్టీసీ డిపో ప్రక్కన గల రహదారిపై, మురుగు కాలువల పక్కన గుడారాలు వేసుకొని జీవిస్తూ, చిన్నాచితక వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న సంచార నక్కల జాతి కుటుంబాలు డెబ్బైకు పైగా ఉన్నాయి. వారికి సరి అయిన ఇళ్ళు లేవు, విద్యుత్ లేక దీపాల వెలుతురులో, ఆకశమే పై కప్పుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ చిన్నలు పెద్దలు పిల్లలతో సహా ఫ్లెక్సీ లే తమ గుడారానికి ఆధారంగా చేసుకొని, రహదారిపైనే వంటావార్పు చేసుకుంటూ జీవిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అప్పుడెప్పుడో చింతల వద్ద వారికి స్థలాలు కేటాయించగా గుడారాలు వేసుకొని అక్కడ జీవిస్తున్న పరిస్థితి వర్షాకాలంలో వాగు పొంగి ఇంటి సామానుతో సహా కొట్టుకుపోవడం, చుట్టూ మెడలోతు నీళ్లు, బురద. అయినప్పటికీ కొందరు గృహాలను ఏర్పరచుకోగా ఐదు నెలల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో గుడారాలన్నీ తగలబడిపోవడం ఉన్న ఆస్తి, ఇంటి సామానంత అగ్నికి ఆహుతి అయిపోవడం జరిగినది. తద్వారా మరలా డిపో పక్కన జీవించడం చూస్తూనే ఉన్నాం.

వారి జీవన శైలిని గమనించి వారి జీవన ప్రమాణాలు పెంచాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టి జిల్లా మీడియా ఇంచార్జ్, సామాజ హితులు ధనిశెట్టి రామునాయుడు ప్రధాని ఉజ్వల యోజన పథకాన్ని వారికి తెలిపి వారి రుజుపత్రాలన్నీ తీసుకొని వెళ్లి గ్యాస్ ఏజెన్సీలను కలవగా స్థిర నివాసం లేని కారణంగా వారికి ఈ పథకం వర్తించదని వారు తెలపడం జరిగింది.

ఈ సందర్భంగా బిజేపి జిల్లా మీడియా ఇంఛార్జ్, సమాజ హితులు ధనిశెట్టి రామునాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను భారతీయ మహిళల కోసం రూపొందించి అమలు చేస్తుంది. అన్ని అర్హతలు ఉన్న మహిళలు వాటి ఫలితాలను పొందుచున్నారు. అయినప్పటికీ ఒంగోలు నగరంలో రోడ్లపై కాలువల పక్కన జీవిస్తున్న నక్క సామాజిక వర్గ కుటుంబాలకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆయా పథకాలను పొందలేకపోతున్నారు. పథకాల అమలులో విధివిధానాలు కొంచెం మార్చగలిగితే ఈ నక్క జాతి కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుస్తుంది. వారి జీవనశైలి జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ప్రస్తుతం వీరికి స్థిరమైన నివాసం లేదని ప్రధాని ఉజ్వల యోజన పథకం ద్వారా అందవలసిన ఉచిత గ్యాస్ కనెక్షన్ ని మీరు పొందలేకపోవడం చాలా బాధాకరం కనుక ప్రభుత్వం వీరి జీవన ప్రమాణాన్ని పెంచడానికి కావలసిన చర్యలను తీసుకోవాలి వీరికి పక్కా గృహాలు నిర్మించేట్లుగా కృషి చేయాలి. అప్పుడే వీరు ఎంతో ఉన్నతంగా మిగిలిన వారితో సమానంగా జీవించగలుగుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *