తనకు చెందిన పరిశ్రమలో పెట్టుబడి పెడితే మీకు భాగస్వామ్యం ఇస్తామంటూ నమ్మించి, పలువురి నుంచి రూ.కోట్ల రూపాయలు దండుకుని మోసగించిన దంపతులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టు అయిన దంపతులపై బోయిన్ పల్లి, తిరుమలగిరి, మహాంకాళి పోలీసు స్టేషన్ ల లో కూడా చీటింగ్ కేసులు ఉన్నాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిక్కడపల్లికి చెందిన హెచ్.దినేష్ (50), జ్యోతి (47) దంపతులు. వీరికి సికింద్రాబాద్ మోండా మార్కెట్ శ్రీరామా ఎంటర్ ప్రైజస్ పేరుతో హోల్ కిరాణాషాప్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు కీసరలో అభినవ్ ఇండస్ట్రీస్ పేరుతో పేపర్ తయారీ పరిశ్రమను కూడా నిర్వహిస్తున్నారు.
తమ వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెడితే మంచి కమీషన్ పాటు పార్టనర్ షిప్ కూడా ఇస్తామని నమ్మించి పలువురి నుంచి రూ.కోట్లు దండుకున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ చెందిన వ్యాపారి పి.లక్ష్మణ్ (55)కు ఈ దంపతులు నమ్మించడంతో రూ.1.10 కోట్లు పెట్టుబడి పెట్టాడు. రెపోమాపో భాగస్వామ్యం ఇస్తామని దంపతులు నమ్మిస్తూ వచ్చారు. ఇలా ఆరు నెలలు గడిచినా తనకు భాగస్వామ్యం ఇవ్వకుండా మోసగించారు. దీంతో తాను పెట్టిన పెట్టుబడి డబ్బులు వెనక్కి ఇచ్చివేయాలని లక్ష్మణ్ నిలదీశాడు.దీంతో దంపతులు నెల రోజుల క్రితం రూ.1.10 కోట్లకు చెక్ ఇచ్చారు. ఆ చెక్ బ్యాంక్ చెల్లకపోవడంతో బాధితుడు లక్ష్మణ్ సిసిఎస్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సిసిఎస్ ఎస్ఐ యుగేందర్ నిందితులైన జ్యోతి, దినేష్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
