పర్యాటక ప్రాంతాలలో యోగాసనాల సాధన ద్వారా యోగాభ్యాసంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించబోతున్నట్లు ఒంగోలు ఆర్డిఓ కె.లక్ష్మి ప్రసన్న
తెలిపారు. 8వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు కొత్తపట్నం బీచ్ ప్రాంతంలో ప్రజలు యోగాసనాలు వేసేలా
చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశాల మేరకు శనివారం ఆమె స్థానిక అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. బీచ్ వద్ద అనువైన మూడు స్థలాలను పరిశీలించగా, వీటిలో యోగాసనాలకు ఏ స్థలం బాగుంటుందో దాన్ని గుర్తించి వెంటనే పరిశుభ్రం చేయించాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం దీనిపై మండల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో వెంట జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, తహసిల్దార్ మధు సూదన్ రావు, కొత్తపట్నం ఎంపీడీవో శ్రీకృష్ణ, ఈవో ఆర్ డి వేణుగోపాల మూర్తి, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

