విద్యార్థుల సంపూర్ణ వికాసం, సంస్కారం దిశగా విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం బోలోపేతం – జిల్లా ఇంచార్జికలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ

విద్యార్థుల సంపూర్ణ వికాసం, సంస్కారం దిశగా విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం బోలోపేతం చేస్తున్నట్లు జిల్లా
ఇంచార్జి కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ
తెలిపారు. గురువారం కొత్తపట్నం మండలం ఈత ముక్కలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ప్రాంగణంలోని సరస్వతి విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు.  అనంతరం ప్రాంగణంలో మొక్కలు నాటి, పేరెంట్ – స్టూడెంట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింటులో ఆయన ఫోటో దిగారు.
             ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ …మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యాంశాలు, బోధనా పద్ధతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన పుస్తకాలు, యూనిఫారం, సన్న బియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. తాను కూడా ప్రభుత్వ విద్యార్థినేనని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ పాఠశాల, కాలేజీలోనే చదువుకున్నానని, డిగ్రీ కోర్సును దూర విద్య ద్వారా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పూర్తి చేశానని వివరించారు. పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడు స్కూల్ కు వెళ్లి రావడానికి ప్రతిరోజూ 5 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేదని గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ  గైర్హాజరు కాకుండా స్కూలుకు వెళ్లే వాడినని చెప్పారు. అవరోధాలను చూసి అధైర్యపడితే లక్ష్యాలను చేరుకోలేమని చెప్పారు. ప్రస్తుతం రోజులు మారాయన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా వారి సమగ్ర వ్యక్తిత్వ వికాస, సంస్కారయుతమైన ప్రవర్తనే  లక్ష్యంగా విద్యా వ్యవస్థలో ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చి అన్ని సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థి దశ నుంచే సమాజంలోని అన్ని విషయాలపై అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నించాలని, ఇష్టంతో చదవాలని పిలుపునిచ్చారు. ఎలాంటి బంధుత్వమూ  లేకపోయినా విద్యార్థుల ఉన్నతిని ఆశించేది గురువులేనని కలెక్టర్ చెప్పారు. గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేలా చదువుకోవాలని, ప్రవర్తనను కాపాడుకోవాలని కలెక్టర్ సూచించారు. చరిత్ర పుస్తకములో మీకంటూ ఒక పేజీ ఉండేలా చూసుకోవాలని చెప్పారు.
             జిల్లా పంచాయతీ అధికారి మరియు కొత్తపట్నం మండల స్పెషల్ ఆఫీసర్ అయిన గొట్టిపాటి వెంకట నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర ఎదుగుదలలో తల్లిదండ్రులను,  టీచర్లను భాగస్వాములు చేసేలా ఈ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులకు
సూచించారు. ఈ దిశగా తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు.
             పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ చెంచుపున్నయ్య మాట్లాడుతూ… గత విద్యా సంవత్సరంలో పాఠశాల సాధించిన ప్రగతి నివేదికను వివరించారు. పదవ తరగతిలో మొత్తం 140 మందికి గాను, 139 మంది ఉత్తీర్ణులయ్యారని, ఒక విద్యార్థి పరీక్షలు రాయలేదని చెప్పారు. మెరుగైన ప్రతిభ చూపడం ద్వారా నలుగురు విద్యార్థులు షైనింగ్ స్టార్స్ గా ఎంపికయ్యారని, మరో ముగ్గురు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించారని చెప్పారు.
                 ఈ కార్యక్రమంలో ఐదుగురు తల్లులకు వారి పిల్లలతో ‘ తల్లికి వందనం ‘ చేయించారు. తల్లి పేరుతో నాటి, పెంచేలా కలెక్టర్ ఈ సందర్భంగా ఆ విద్యార్థినులకు మొక్కలను అందించారు. తల్లులకు ముగ్గులు, లెమన్ స్పూన్ పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన వారికి కలెక్టర్ చేతుల మీదగా బహుమతులు ప్రదానం చేయించారు. గత విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో అత్యధిక మార్కులు (591) సాధించిన ఆకురాతి గీతికను, వారి తల్లిదండ్రులను కూడా కలెక్టర్ సన్మానించారు. తల్లికి వందనం పథకం ద్వారా తమకు కలిగిన ప్రయోజనాన్ని విద్యార్థులు ఈ సందర్భంగా వివరించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా పాఠశాలలోనే భోజన కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు.
            ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కె.శాంతి,  డిప్యూటీ ఎంపీడీవో ఎన్. వేణుగోపాలకృష్ణమూర్తి , ఎంఈఓ -2 పద్మావతి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, కార్యక్రమ సాక్షిగా పొందూరి
వెంకారెడ్డి, స్థానిక ప్రముఖులు కుంభా శ్రీనివాసరావు , ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *