శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయటంపై మరింతగా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
చెప్పారు. శనివారం మార్కాపురంలోని శ్రీనివాస ఫంక్షన్ హాలులో జరిగిన డివిజన్ లోని మండల, డివిజన్ స్థాయి అధికారుల ప్రత్యేక సమావేశంలో స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తో కలిసి ఆమె పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల పురోగతిపై శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించారు. సంబంధిత శాఖలు మరింత సమన్వయంతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి సమస్యలను జిల్లా అధికారులు పరిష్కరించాలని, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని ఆమె సూచించారు. పథకాల అమలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తే, వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు.
పి.ఎం.జన్ మన్ పథకంలో భాగంగా గిరిజన ఆవాస గ్రామాలలో అర్హులకు ఇల్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో స్థానిక అటవీ అధికారుల తరఫు నుంచి ఏమైనా జాప్యం జరిగితే డీఎఫ్ఓ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. హాస్టళ్లు, పాఠశాలలు, అంగనవాడి సెంటర్లలో దోమల మందు స్ప్రే చేయించాలన్నారు. సీజనల్ వ్యాధుల వలన ప్రజలు ఎవరైనా చనిపోతే సంబంధిత వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. కాగా, ఈ దిశగా తీసుకుంటున్న చర్యలను డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు ఆమెకు వివరించారు.
బడి ఈడు పిల్లలందరూ ఖచ్చితంగా పాఠశాలల్లో ఉండేలా ఎం.ఈ.ఓ.లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. బంగారు బాల్యం అమలు, పిల్లలకు పాఠశాలల్లో ఏమైనా ఇబ్బంది కలిగితే అధికారుల దృష్టికి తీసుకువెళ్లేలా 1098 నెంబర్ పై అవగాహన కల్పించడం, రెగ్యులరుగా పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయటం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీవోలు, ఎంఈఓలు రెగ్యులరుగా పాఠశాలలను సందర్శించాలని ఆమె చెప్పారు. మార్కాపురం డివిజన్లో 4377 మంది వల్నరబుల్ పిల్లలు ఉన్నారని, వీరి అభివృద్ధి కోసం మార్గదర్శకులను గుర్తించి అనుసంధానం చేయాలని అన్నారు. ‘తల్లికి వందనం’ డబ్బులు జమ కావటంలో ఈ-కేవైసీ సమస్యలు ఉంటే వాటిని త్వరగా పరిష్కరించి లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆధార్ కార్డు లేని చిన్నారులకు అందుకు గల కారణాలను గుర్తించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన వారికి డొమిసిల్ సర్టిఫికెట్లను తహసీల్దారులు త్వరగా ఇవ్వాలని ఆమె చెప్పారు. అలాంటి కేసులను తాసిల్దారులే స్వతహాగా గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పీ – 4 పథకంలో మార్గదర్శకులను త్వరగా గుర్తించాలని, ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ అనుబంధ పనులను చేపట్టడంలో మరింత పురోగతి సాధించాలని, గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా చూసుకోవాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ఇతర డివిజన్లతో పోలిస్తే మార్కాపురంలో పురోగతి కొంత నెమ్మదిగా ఉందని, దీనిని వేగవంతం చేయడానికి
ప్రజా ప్రతినిధుల సహకారంతో సంబంధిత శాఖలు సమన్వయంగా పనిచేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, మార్కాపురం, గిద్దలూరు అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్లు జి.సందీప్ కృపాకర్, నిషా కుమారి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


