ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిబద్ధతతో అమలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
శుక్రవారం కొండపి నియోజకవర్గం, మర్రిపూడి మండలం, చిమట గ్రామంలో మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను స్వయంగా అందచేసారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకం ఒక్కొక్కటీ అమలుచేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమన్నారు. గతంలో కుటుంబంలో ఒక బిడ్డకు మాత్రమే వర్తించే పథకాన్ని తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంత మందికి ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతున్నదని తెలిపారు. మహిళల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి గారు గతంలో మహిళల కష్టాలను చూసి దీపం పథకం ద్వారా గ్యాస్ స్టవ్ లు, సిలిండర్లు పంపిణీ చేశారని, ప్రస్తుతం దీపం- 2 పథకం ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఆగస్టు 15 నుండి రాష్ట్రంలోనీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల సంక్షేమం కొరకు ఆగస్టు 2న రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గతంలో అందిస్తున్న సామాజిక పెన్షన్లను రూ. 3,000 నుండి పెంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద రూ.4,000 అందించడం జరిగిందన్నారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలో కొత్తగా లక్షా 8వేల 206 మందికి స్పౌజ్ పింఛన్లు అందిస్తున్నామన్నారు. జిల్లాలో 5 వేల 174 మందికి, కొండపి నియోజక వర్గంలో 799 మందికి, మర్రిపూడి మండలంలో 95 మందికి, ఈ పంచాయతీ పరిధిలో 7 మందికి స్పౌజ్ పింఛన్లు ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. రైతులకు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం సహాయంతో కలిపి రూ. 7,000 రైతులు ఖాతాకు ఆగస్టు 2న జమ చేయనున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మా నాయక్, ఎస్ సి కార్పొరేషన్ ఈడి అర్జున్ నాయక్, మండల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

