మేదరమెట్ల జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మనపాలెం గ్రామం వద్ద చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుండి నెల్లూరు వైపు వెళ్తున్న ‘ఎంజీ హెక్టర్’ కారు (ఏపీ39 సీఎస్ 5790) ఉదయం సుమారు 8:50 గంటల సమయంలో తిమ్మనపాలెం వద్దకు చేరుకోగానే అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. కారు నడుపుతున్న షేక్ జాబిర్ అహ్మద్, ముందు సీటులో కూర్చున్న షేక్ బషీర్, మరియు వెనుక సీటులో ఉన్న ఎండీ జాఫర్ షరీఫ్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు.
క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తీవ్రంగా గాయపడిన ఎండీ జాఫర్ షరీఫ్ ఉదయం 11:22 గంటల సమయంలో మృతి చెందారు. కారు నడుపుతున్న జాబిర్ అహ్మద్ మరియు బషీర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
కేసు నమోదు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు.
