హైదరాబాద్ ఫిబ్రవరి 3
(జే ఎస్ డి ఎం న్యూస్) ;
నగరంలోని లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు అండగా నిలుస్తున్న ‘భరోసా’ కేంద్రాన్ని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
(ఎస్ సి పి సి ఆర్) చైర్పర్సన్ ,సభ్యులు మంగళవారం సందర్శించారు. కేంద్రం పనితీరు, బాధితులకు అందుతున్న సేవలను ఈ బృందం క్షుణ్ణంగా సమీక్షించింది.
ఈ సందర్శనలో భాగంగా కమిషన్ ప్రతినిధులు భరోసా సిబ్బందితో ముఖాముఖి మాట్లాడారు. లైంగిక నేరాలకు గురై మానసిక క్షోభను అనుభవిస్తున్న బాధితులకు ఒకే చోట అన్ని రకాల సేవలు అందించే ‘వన్-స్టాప్ సపోర్ట్ సెంటర్’ ఉద్దేశాలను, లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును సందర్శించి, పిల్లల పట్ల అనుసరిస్తున్న సున్నితమైన విధానాలను పరిశీలించారు.
వుమెన్ సేఫ్టీ వింగ్ (డబ్ల్యూ ఎస్ డబ్ల్యు) ఏసీపీ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా భరోసా కేంద్రం సాధించిన విజయాలను వివరించారు. ముఖ్యంగా
2025 సంవత్సరంలో: హైదరాబాద్ నగరంలో పోక్సో కేసుల్లో ఏకంగా 38 శిక్షలు పడేలా చేశారన్నారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది అత్యుత్తమ రేటు అని అధికారులు వెల్లడించారు.
కేసుల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు, పాటిస్తున్న ఉత్తమ పద్ధతులను ఈ సందర్భంగా చర్చించారు.కమిషన్ ప్రశంసలు భరోసా కేంద్రంలోని మౌలిక సదుపాయాలు, క్రమబద్ధమైన పనితీరును చూసి చైర్పర్సన్ సంతోషం వ్యక్తం చేశారు. బాధితుల పట్ల కేంద్రం చూపుతున్న శ్రద్ధ, కౌన్సెలింగ్ ప్రోటోకాల్స్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. భరోసా అమలు చేస్తున్న ఉత్తమ విధానాల గురించి ఇతర రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. కమిషన్ తరపున పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇస్తూ, ఇకపై ప్రతి ఏటా కేంద్రం పనితీరుపై సమీక్ష నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు.హైదరాబాద్ మహిళా రక్షణ విభాగం డీసీపీ డాక్టర్ పి. లావణ్య నాయక్ జాదవ్ మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుల సందర్శన తమకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. చిన్నారుల రక్షణను మరింత బలోపేతం చేసేందుకు తమ విభాగం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ సి పి సి ఆర్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, కమిషన్ సభ్యులు అపర్ణ, వందన, చందన, సరిత, ప్రేమలత అగర్వాల్,వచన్ కుమార్ డీసీపీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. డీసీపీ (డబ్ల్యూ ఎస్ డబ్ల్యు) డాక్టర్ పి. లావణ్య నాయక్ జాదవ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



