హైదరాబాద్ ఏప్రిల్ 17
(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం బిజెపికి ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ తెలంగాణ – ఏపీ విభజనపై బిజెపి విషం కక్కుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ – ఏపీ రాష్ట్రాల విభజనను భారత్ – పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ బిజెపి ఎంపి తేజస్వి సూర్య వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం అని, ఈ వ్యాఖ్యలు పార్లమెంటు వ్యవస్థను కించపరచడమేనని చిన్నారెడ్డి అన్నారు.బిజెపికి ప్రజాస్వామ్యంపై కానీ, పార్లమెంట్ వ్యవస్థపై కానీ గౌరవం లేదని, అందుకే బీజేపీ నాయకులు పదే పదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిస్సిగ్గుగా విషం కక్కుతూనే ఉన్నారని చిన్నారెడ్డి పేర్కొన్నారు.మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టిన తనకు.. ప్రస్తుతం బిజెపి
అవలంబిస్తున్న ధోరణితో తన రక్తం మరుగుతోందని చిన్నారెడ్డి అన్నారు.స్వరాష్ట్రం తెలంగాణ కోసం ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, మేధావులు ఉద్యమించారని, ఈ ఉద్యమాలను గౌరవించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీప్రజాస్వామికంగా పార్లమెంటు ఆమోదంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని చిన్నారెడ్డి వివరించారు.అంతకు ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ తాను 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను సేకరించి సోనియా గాంధీతో 2000 సంవత్సరంలోనే భేటీ అయ్యానని, ఆ తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం ఊపందుకుందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.బిజెపి ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర విభజననుకించపరుస్తూ మాట్లాడిన సందర్భంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు, మిగతా ఆరుగురు బిజెపి ఎంపీలు చోద్యం చూస్తూ కూర్చున్నారు తప్ప వ్యతిరేకించలేదని చిన్నారెడ్డి విమర్శించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన తేజస్వి సూర్యకు తెలంగాణ అంశానికి సంబంధం ఏమిటీ అని, తెలంగాణ ప్రస్తావన అవసరం ఎందుకు అని చిన్నారెడ్డి ప్రశ్నించారు.ప్రధాని నరేంద్ర మోడీ కూడా గతంలో తెలంగాణ విభజనకు వ్యతిరేకంగా మాట్లాడారని, తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని మోడీ చెప్పారని, బిజెపి ముమ్మాటికి తెలంగాణ వ్యతిరేకి అని మరోసారి రుజువైందని చిన్నారెడ్డి అన్నారు.బిజెపి ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలకు వెంటనే బేషరతుగా పార్లమెంట్ లోనే క్షమాపణ చెప్పాలని, తెలంగాణ రాష్ట్రం పట్ల బిజెపికి ఉన్న వైఖరిని స్పష్టం చేయాలని చిన్నారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
