ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో పేద ముస్లిం విద్యార్థినీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ కార్పొరేట్ ఉచిత విద్యను అందించడమే ధ్యేయంగా వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ తాలీం ఏ హునర్ టాలెంట్ టెస్ట్ ను నిర్వహించడం ముస్లింల సంక్షేమం పట్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ చిత్తశుద్ధిని మరోమారు నిరూపించుకున్నారని ముస్లిం సమాజం అంతా ఉత్తరకాలని తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర నాయకులు పఠాన్ హనీఫ్ ఖాన్ అన్నారు.
బుధవారం స్థానిక మీడియా కెమెరామెన్ అసోసియేషన్ భవనంలో ప్రకాశం జిల్లా వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హనీఫ్ ఖాన్ మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోటే ముస్లిముల సంక్షేమం,సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రారంభమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ రూపకల్పన తో పేద ముస్లిం విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా ఇంటర్మీడియట్
విద్యను అందించడమే లక్ష్యంగా 10వ తరగతిలో
450 పైగా మార్కులు సాధించి తెల్ల రేషన్ కార్డు దారులైన వారికి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా కార్పొరేట్ కళాశాలలో 100% ఉచిత ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్యతోపాటు ఐఐటి జేఈఈ నీట్ ఎంసెట్ లకు ఉచిత శిక్షణ అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో
హాస్టల్, భోజన సదుపాయం, పుస్తకాలు పూర్తిగా ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఆడపిల్లలకు 33% ప్రత్యేక రిజర్వేషన్ కల్పించబడుతుందని తెలిపారు. నిరుపేద ముస్లింలు ఉన్నత స్థానంలో ఉండాలంటే వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేది ఒక్క విద్య మాత్రమే అని భావించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫారుక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల గౌరవ సలహాదారులు ఎం.ఏ.షరీఫ్ లు తాలీం ఏ హునర్ కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతును, ప్రోత్సాహాన్ని ఇచ్చారని తెలిపారు. జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అహ్మద్ భాష మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం పేద విద్యార్థి విద్యార్థులకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చిందని, చారిత్రాత్మక నిర్ణయంతో వందలాది మంది పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడానికి బంగారు బాట వేసిందని అన్నారు. అందులో భాగంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ తాలీం ఏ హునర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని చెప్పారు.
ఈ పధకం ద్వారా 2026- 27 సంవత్సరానికి గాను లో 250 మంది పేద ముస్లిం విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత
ఇంటర్మీడియట్ విద్య అందించడం జరుగుతుందని అన్నారు. పదవ తరగతిలో 450 పైగా మార్కులు సాధించిన ముస్లిం విద్యార్థిని విద్యార్థులు టాలెంట్ టెస్ట్ కు అర్హులుగా తెలిపారు. వారికి తప్పనిసరిగా వైట్ రేషన్ కార్డు ఉండాలని పేర్కొన్నారు. అలాంటివారు ఆన్ లైన్ పద్ధతిలో ఈనెల 06వ తేదీ నుండి 12వ తేదీ వరకు దరఖాస్తులు నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు నమోదు చేసుకున్న వారికి ఈనెల 17వ తేదీన ఆన్ లైన్ పద్ధతిలోనే టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని ఫలితాలు కూడా ఆన్ లైన్ లో చూసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కొరకు ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గల ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (పాత రిమ్స్) లో ఉన్న ప్రకాశం జిల్లా వక్ఫ్ బోర్డు కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
సమావేశంలో ముందుగా తాలీం ఏ హునర్ కార్యక్రమం ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ పత్రిక సమావేశంలో వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ షేక్ సాదిక్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ టి. సుధాకర్, తెదేపా నాయకులు షేక్ అజీమున్నీసా, షేక్ కాలేషా బాబు, షేక్ జమీల్ అహ్మద్, పఠాన్ నజీర్ ఖాన్, షేక్ బషీర్ పాల్గొన్నారు.

